వరదనీటితో ప్రాజెక్టులు నింపుతాం..

14 Sep, 2016 20:35 IST|Sakshi
వరదనీటితో ప్రాజెక్టులు నింపుతాం..
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
 
అచ్చంపేట: రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడుతున్నాయని, ఇకపై తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా వరద నీటితో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నింపుతామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.  బుధవారం ఆయన పులిచింతల ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...   పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం ఏ ఆశయంతో నిర్మించారో ఆ ఆశయం నెరవేరబోతుందన్నారు.  ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు  సమన్వయంతో పనిచేస్తే తెలుగు రాష్ట్రాలలో కరువు లేకుండా చేయవచ్చన్నారు. కొండ ప్రాంతాలలో, అడవులలో పడిన వర్షపు ప్రవాహాన్ని  నిల్వ ఉంచుకుంటే ఎటువంటి ఇబ్బందులుండవన్నారు.  ప్రాజెక్టు వద్ద నిర్మించిన జలవిద్యుత్‌ ప్రాజెక్టును ట్రయల్‌రన్‌ వేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడు 870 అడుగుల మేర నీటిని నిల్వ ఉంచినట్లు చెప్పారు.  ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే అవకాశాలు ఉన్నాయన్నారు. పునరావాస కేంద్రాలలో సమస్యలన్నింటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.  ముంపు గ్రామాల ప్రజలు తక్షణమే వారి గ్రామాలు వదిలి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. ఆయన వెంట జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య, సీఈ వైఎస్‌ సుధాకర్, ఎస్‌ఈ ఎం.వెంకటరమణ, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈలు రాఘనాధరావు, మునిరత్నం ఉన్నారు.
మరిన్ని వార్తలు