బుధవారం నుంచి పుష్పయాగం

16 Aug, 2016 22:24 IST|Sakshi
1,423 సంవత్సరాల చరిత్రలో ఇదే ప్రథమం
టన్ను పువ్వులు పంపిన వేగేశ్న ఫౌండేషన్‌
 
బాపట్ల: పట్టణంలోని క్షీరభావన్నారాయణస్వామి ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పుష్పయాగం నిర్వహించేందుకు ముస్తాబు చేస్తున్నారు. పోలేరమ్మ తల్లికి చీరె,సారె పంపిణీతో బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్వాహకులు  ఏర్పాట్లు చేస్తున్నారు. బుధ,గురువారాల్లో జరిగే పుష్పయాగానికి ఈ పాటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు శిఖరం ఫణిరాజశర్మ మంగళవారం దేవాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ కార్యక్రమ ప్రాశస్త్యాన్ని వివరించారు. 1,423 సంవత్సరాల్లో భావదేవుని చరిత్రలో తొలిసారిగా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ యాగం ఈనెల 18న శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్, హయగ్రీవ జయంతిలను పురస్కరించుకొని నిర్వహిస్తున్నారన్నారు. పుష్పయాగంలో భాగంగా స్వామివారికి 30 క్వింటాళ్ల పూలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారుడు నల్లారి మోహనరంగాచార్యులు పాల్గొంటారని తెలిపారు. పుష్పయాగం సందర్భంగా శ్రీభావన్నారాయణ దేవాలయంతోపాటు భావపురిలోని అన్ని దేవాలయాలను ఆలంకరించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు  గంటా శ్రీనివాసరావు (చిన్న), పాపినేని వెంకటరాధాకృష్ణ, మూసంగి శేషుకృష్ణ, చామర్తి ఆంజనేయులు, చింతలపాటి రమణ ఉన్నారు. 
 
టన్ను పువ్వులు ఇచ్చిన వేగేశ్న ఫౌండేషన్‌ నరేంద్రవర్మ
పుష్పయాగం సందర్భంగా వేగేశ్న ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేంద్రవర్మరాజు స్వామివారి ఆలంకరణకు టన్ను పువ్వులను బహూకరించారు. ప్రత్యేక పూజాకార్యక్రమాలతోపాటు శాశ్వత ధూప నైవేద్యాలకు ఆయన తన వంతుగా ప్రతి నెలా రూ.15వేలు ఇచ్చేందుకు నిర్ణయించారు.
మరిన్ని వార్తలు