బాలలు.. భళా!

22 Jan, 2017 22:45 IST|Sakshi
బాలలు.. భళా!
- నంది నాటకోత్సవాల్లో అలరించిన బాలలు
- ఆలోచింపజేసిన బాలల నాటికలు 
కర్నూలు(హాస్పిటల్‌): నందినాటకోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు జరిగిన బాలల నాటికలు పిల్లలు, పెద్దలను ఆలోచింపజేశాయి. పిల్లల అభిప్రాయాలను తెలుసుకోకుండా వారిపై చదువును రుద్దే పెద్దల గురించి బంగారు కొండ, బాలకార్మికుల ఇతివృత్తాన్ని తెలిపే పసిమొగ్గలు, చెట్ల పరిరక్షణతో ప్రయోజనాలు, నిర్మూలించడం వల్ల నష్టాలపై వృక్షో రక్షతి రక్షితః అనే నాటికలు ఆకట్టుకున్నాయి. పాఠశాల, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎంతో హృద్యంగా నాటికల్లో నటించి చూపించారు. 
 
పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవాలని చెప్పే బంగారుకొండ..
కడప జిల్లా నందలూరులోని అమరావతి సొసైటీ ఆఫ్‌ కల్చరల్‌ ఆర్ట్స్‌ వారి బంగారు కొండ బాలల సాంఘిక నాటిక ఇటు పిల్లలు, అటు పెద్దలను అలరించింది. నేటి సమాజం, కుటుంబాలు, తల్లిదండ్రులు, పిల్లల అభీష్టాలు, ప్రవర్తనలను ఈ నాటిక ప్రతిబింబించింది. బిడ్డల అభిప్రాయాలు, ఆసక్తిని తెలుసుకోకుండా వారిని ఉన్నతంగా తీర్చిదిద్ది లక్షలు ఆర్జించాలనే తల్లిదండ్రుల నటన ఆకట్టుకుంటుంది. బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం తండ్రి అవినీతికి పాల్పడటం, తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక కుమారుడు అనుభవించిన మానసికక్షోభను కళ్లకు కట్టినట్లు చూపించారు. తల్లిదండ్రులుగా ఎస్‌. రమ్యశ్రీ, ఎ. సాయిప్రణయ్,  కుమారునిగా బి. ఉమర్‌ ఫరూక్‌ నటించారు.  రచన బీఎం బాషా, దర్శకత్వం బి.సాయిసందీప్, దృశ్యబంధం ఎం. వెంకటేష్, మేకప్‌ హిమకుమార్, సంగీతం పీడీఆర్‌ ప్రసాద్‌ అందించారు. 
 
బాలకార్మిక ఇతివృత్తం ‘పసిమొగ్గలు’
మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ మండలం హాజిపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నటించిన ‘పసిమొగ్గలు’ నాటిక బాలకార్మిక వ్యవస్థను కళ్లకు కట్టింది. పసితనంలోనే పనుల్లో పెట్టుకుని బాలలను చదువుకు దూరం చేయకూడదనేది ఇతివృత్తం. పత్తిపొలంలో పనిచేసే పిల్లలు అక్కడి ఘాటైన రసాయనిక మందులతో ఏ విధంగా చనిపోతున్నారో చూపించారు. దేవీ రచించిన ఈ నాటికకు టీవీ రంగయ్య దర్శకత్వం వహించారు. పాత్రదారులుగా సుజాత, నవీన్, మౌనిక, నందిని, భారతి, అక్షయ్, సాయిక్రిష్ణ నటించారు. 
చెట్ల ఉపయోగాలను తెలిపే ‘వృక్షో రక్షతి రక్షితః’
 మనిషి అవివేకంతో వృక్షాలను నాశనం చేస్తున్న క్రమంలో వనదేవత మానవుని చర్యలకు బాధపడి అనాదిగా తాను పడిన ఆవేదనను మూడు  ఘటనల ద్వారా తెలియజేయడమే ‘వృక్షో రక్షతి రక్షితః’ నాటిక సారాంశం. నాటకాన్ని అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు రణగ్య, పల్లవి, గిరీష్, సుశీల, కావ్యశ్రీ, దివ్యశ్రీ, శృతి, శిరీష ప్రదర్శించారు. రచన, దర్శకత్వం ఆముదాల సుబ్రహ్మణ్యం.
 
నేటి నాటికలు
ఉదయం 10.30 గంటలకు శ్రీ మల్లి ఎడ్యుకేషనల్‌ సొసైటీ వారి ‘పవిత్ర భారతదేశం’, మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర కల్చరల్‌ అసోసియేషన్‌ వారి ‘సత్య స్వరాలు’, మధ్యాహ్నం 2 గంటలకు పాలేమ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ వారి ‘స్ఫూర్తి’ బాలల నాటిక, మధ్యాహ్నం 3.30 గంటలకు నాగర్‌కర్నూలు వారి ‘స్వయంకృతం’ బాలల నాటిక’ ఉంటాయని ఎఫ్‌డీసీ మేనేజర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు