శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన జిల్లా యాత్రికులు

20 Jul, 2016 00:38 IST|Sakshi
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : జిల్లా నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన సుమారు 100 మంది యాత్రికులు జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం లోని శ్రీనగర్‌ ప్రాంతంలో చిక్కుకుపోయారు. నగరానికి చెందిన అంబికా ట్రావెల్స్‌ ఆధ్వర్యంలో సుమారు 100 మంది భక్తులు అమర్‌నాథ్‌ యాత్రకు ఏలూరు నుంచి గత ఆదివారం బయలు దేరారు. అయితే శ్రీనగర్‌లో కర్ఫూ్య, బ్లాక్‌డే పాటిస్తున్న నేపథ్యంలో వీరిని శ్రీనగర్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని సైతానీ నాలా ప్రాం తంలో సైనికులు ఆపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు అంబికా ట్రావెల్స్‌ నిర్వాహకులు పైడి భీమేశ్వరరావు ‘సాక్షి’కి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఆహారానికి ఇబ్బంది లేకపోయినా వాతావరణ మార్పులు, అక్కడే వేచి ఉండడం వల్ల యాత్రికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. సైతానీ నాలా ప్రాంతం నుంచి సుమారు 50 కిలోమీటర్ల మేర యాత్రికుల బస్సులు, కార్లు, మినీ లారీలు నిలిచిపోయాయన్నారు. ఇంటర్నెట్‌ పనిచేయడం లేదని, సెల్‌ సిగ్నల్స్‌ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్శీర్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై యాత్రికులు నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 
 
మరిన్ని వార్తలు