ఆ కోచింగ్ సెంటర్లో ఏం జరిగింది?

22 Jul, 2016 03:15 IST|Sakshi
ఆ కోచింగ్ సెంటర్లో ఏం జరిగింది?

ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సెంటర్‌పై అనుమానాలు

సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ : ఎంసెట్-2 పేపర్ లీకేజీ ఆరోపణల వ్యవహారంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి, పరీక్షకు ఒకరోజు ముందు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులను హైదరాబాద్‌కు రప్పించుకుని పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు ఈ కోచింగ్ సెంటర్‌పై ఆరోపణలు వస్తున్నాయి. చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న ఆయా విద్యార్థులకు ఎంసెట్-2 ఫలితాల్లో వెయ్యి లోపు ర్యాంకులు వచ్చాయని అదే కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థి తెలిపారు.

నిర్వాహకులు అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో తనకు వేల ల్లో ర్యాంకు వచ్చిందని, డబ్బులు చెల్లించడంతో చదువులో తనకంటే బాగా వెనకబడిన విద్యార్థులకు వెయ్యి లోపు ర్యాంకు వచ్చిందని సదరు విద్యార్థి చెబుతోంది. మెడికల్ సీటు కావాలంటే దిల్‌సుఖ్‌నగర్‌లోని ఈ కోచింగ్ కేంద్రంలో సంప్రదించాలంటూ కొందరు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఫోన్ కూడా వెళ్లాయి. దీంతో వారి ఫోన్ నెంబర్లు, కాల్ డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మధ్యవర్తులు ఏం మాట్లాడారన్న కోణంలో పరిశీలిస్తున్నారు. మధ్యవర్తులు నిజంగా పేపర్‌లోని ప్రశ్నలను బయటకు తేగలిగారా? లేదా డమ్మీ పేపర్‌ను రూపొందించి అదే అసలుగా నమ్మించి డబ్బు దండుకున్నారా? అన్న అంశాలను కూడా ఆరా తీస్తున్నారు.

 ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ ఆస్కారమెంత?
ఎంసెట్-2 ప్రశ్నపత్రాల ముద్రణ విజయవాడలో జరిగిందా? లేదా? అన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. అయితే ప్రాథమికంగా తేల్చిన దాని ప్రకారం విజయవాడలో పేపర్ ముద్ర ణ జరగలేదని తెలుస్తోంది. పైగా ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నలు మాత్రమే ముద్రిస్తారని, అవి ఏ పరీక్షకు సంబంధించినవో ఎవరికీ తెలియదని చెబుతున్నారు. ఒక్క ముద్రణ సంస్థ యజమానికి మాత్రం కొంతవరకు తెలిసే అవకాశం ఉంటుందంటున్నారు. ఒకవేళ ముద్రణ సంస్థ నుంచి ప్రశ్నలు లీక్ అయితే అది యజమానికి తెలియకుండా జరిగిందా అన్న కోణంలో అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. 15 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ముద్రణ సంస్థ నుంచి ఎంసెట్ పేపర్ లీక్ అయ్యింది. అది ముద్రణ సంస్థ యజమాని నిర్లక్ష్యం కారణంగా.. అందులో పని చేసే వ్యక్తి నుంచి మధ్యవర్తులు పేపర్ కాపీని పొందినట్టు పోలీసు విచారణలో తేలింది. అయితే ప్రసు ్తతం ఆ పరిస్థితి లేదని ఎంసెట్ అధికారులు భావిస్తున్నారు. అసలు వాస్తవం ఏంటన్నది సీఐడీ విచారణలో వెలుగులోకి రానుంది.

 25లోగా ప్రాథమిక విచారణ!
ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. సీఐడీ అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో మూడు బృందాలు గురువారం రంగంలోకి దిగాయి. ఈ నెల 25న ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉన్నందున ఆలోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని సీఐడీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తోంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఆరోపణలు చేస్తున్న వారిని విచారించాలని నిర్ణయించింది. ఒక బృందం వరంగల్ చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టింది. ఎంసెట్-1లో వచ్చిన ర్యాంకులు, ఎంసెట్-2లో వచ్చిన ర్యాంకులను బేరీజు వేస్తోంది. వరంగల్  జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు ఎంసెట్-2లో మంచి ర్యాంకులు సాధించారు.

సీఐడీ అధికారులు వారి తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. అలాగే విజయవాడలో ఆ విద్యార్థులు కోచింగ్ తీసుకున్న కేంద్రానికి మరో బృందం బయల్దేరింది. అక్కడ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించడంతోపాటు వారు నిర్వహించిన మాక్ టెస్టు పేపర్లను సీఐడీ స్వాధీనం చేసుకుంది. రూ.70 లక్షలు, కోటి ఇస్తే మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ కొందరు తల్లిదండ్రులకు కాల్స్ వచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న సీఐడీ.. వారి సెల్‌ఫోన్ కాల్‌డేటాను విశ్లేషించే పనిలో నిమగ్నమైంది. ర్యాంకులు సాధించిన వారి తల్లిదండ్రుల కాల్‌డేటాతో పాటు మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల ఫోన్‌కాల్స్‌ను విశ్లేషిస్తోంది. ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిపై సీఐడీతోపాటు నిఘా ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి సారిస్తున్నారు. పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి, ఎంసెట్-2 నిర్వహణకు ముందు వీరు ఎక్కడ ఉన్నారు, వారి ఆర్థిక వ్యవహారాలపై సమాచారం సేకరిస్తున్నారు.

సీఐడీకి మరిన్ని వివరాలు
ఎంసెట్-2 పరీక్షకు సంబంధించిన ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణరావు సీఐడీ అధికారులకు గురువారం మరిన్ని వివరాలు అందజేసినట్లు తెలిసింది. విద్యార్థుల వారీగా మార్కులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు ఇచ్చినట్లు సమాచారం.వాటితోపాటు ఎంసెట్-1లో ఎక్కు వ మార్కులు వచ్చి ఎంసెట్-2లో తక్కువ మార్కులు వచ్చిన వారి వివరాలను, ఎంసెట్-1లో తక్కువ మార్కులు వచ్చి, ఎంసెట్-2లో ఎక్కువ మార్కులు వచ్చిన వివరాలను కూడా అందజేసినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు