రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు?

4 Sep, 2016 01:40 IST|Sakshi
రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు?

పార్టీ రాష్ట్ర నేతల తీరును తప్పుపట్టిన బీజేపీ ప్రధాన కార్యదర్శి

 సాక్షి, అమరావతి:  బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌సింగ్ పార్టీ రాష్ట్ర నేతల్ని గట్టిగా ప్రశ్నించారు. మిత్రపక్షంగా కొనసాగుతున్న టీడీపీసైతం గడువులు పెట్టి బెదిరింపుల సవాళ్లు చేసినా స్పందించరా? అని తూర్పారపట్టారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించేందుకు శనివారం విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్ధనాథ్‌సింగ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.హరిబాబు, ముఖ్యనేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అరుణ్‌సింగ్ ప్రసంగిస్తూ.. విజయవాడలో తనకు ఎక్కడ చూసినా సీఎం చంద్రబాబు పెద్దపెద్ద ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయని.. ప్రధానమంత్రి మోదీ ఫ్లెక్సీ ఒక్కటీ కనిపించట్లేదన్నారు. ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ ఒక్కదాన్నే దోషిగా చూపేలా మిత్రపక్ష టీడీపీసహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నేతలందరూ కృషి చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు