‘వాట్సప్‌’ విప్లవం

19 Sep, 2016 23:06 IST|Sakshi
‘వాట్సప్‌’ విప్లవం
  •  విషయ సేకరణలో కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం 
  •  గ్రూప్‌ ఛాటింగ్‌తో యువత హల్‌చల్‌ 
  •  పోలీసులు, జర్నలిస్టులకు చక్కటి కమ్యూనికేషన్‌ ‘యాప్‌’
  • సమాచార, సాంకేతిక (ఐటీ) రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఇంటర్నెట్‌ రాకతో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. ఇంటర్నెట్టే సంచలనమనుకుంటే.. దాని ఆధారంగా వచ్చిన ‘సోషల్‌ నెట్‌వర్కింగ్‌’ సైట్లు మరో సంచలనం. ఇప్పుడు ‘ఫేస్‌బుక్‌’, వాట్సప్, ట్విట్టర్‌ హవా సాగుతోంది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి వాట్సాప్‌ చక్కటి ‘యాప్‌’గా ఇది ఉపయోగపడుతోంది. ఇప్పుడొస్తున్న ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ వాట్సప్‌ తప్పనిసరిగా ఉంటోంది. దీన్ని ఉద్యోగులు, యువత దైనందిన జీవితంలో భాగంగా మార్చుకుంది. పోలీసులు, జర్నలిస్టులకు సైతం చక్కటి కమ్యూనికేషన్‌ ‘యాప్‌’గా వాట్సప్‌ ఉపయోగపడుతోంది. – మహబూబ్‌నగర్‌క్రైం/అలంపూర్‌ రూరల్‌
     
    ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘వాట్సప్‌’ సందడి చేస్తోంది. పల్లెలను సైతం పలకరిస్తోంది. వినియోగదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ కలిగివున్న ప్రతి ఒక్కరూ వాట్సప్‌ వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. దీనిద్వారా సందేశాలు, ఫొటోలు, వీడియోలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ‘కాలింగ్‌’ ఆప్షన్‌ కూడా రావడంతో బంధువులు, స్నేహితులతో ఎంచక్కా మాట్లాడుతున్నారు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులతో కమ్యూనికేషన్‌ నడపడానికి వాట్సప్‌ను సమర్థవంతంగా వాడుకుంటున్నాయి. మనకు బాగా తెలిసిన వారితో గ్రూప్‌గా ఏర్పడి కమ్యూనికేషన్‌ నడిపించవచ్చు.
     
    పోలీసులు, జర్నలిస్టులు సైతం..
    విషయాన్ని సేకరించి అందరికంటే ముందే తానే చేరవేయాలన్న కుతూహలం యువతలో బలంగా ఉంది. అందుకే వాట్సప్‌లను ఉపయోగిస్తూ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏకకాలంలో క్షణాల్లో అందరికీ ఒకేసారి విషయాన్ని చేరవేయగలుగుతున్నారు. నేరాలకు చెక్‌ పెట్టేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వాట్సప్‌ ద్వారా జిల్లా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా తక్షణమే వాట్సప్‌ ద్వారా సమాచారం తెలియజేయాలని పోలీసు ఇప్పటికే సిబ్బందిని ఆదేశించారు. జర్నలిస్టులు సైతం వార్తలు, ఫొటోల సేకరణకు, వాటిని ప్రచురణ కేంద్రాలకు పంపడానికి వ్యాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో ఏవైనా సంఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్నా తక్షణమే సమాచారం పంపగలుగుతున్నారు.
     
     ఆరోగ్య సమస్యలు సైతం..
    మరోవైపు స్మార్టుఫోన్లు ఎక్కువగా వాడటం మంచిది కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. సెల్‌ఫోన్లు చూస్తూ ఎక్కువగా వాట్సప్‌ ఛాటింగ్‌ చేయడం ద్వారా అతినీలిలోహిత కిరణాల నుంచి కంటి సమస్యలు అలాగే మెడ నొప్పులు, నరాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ శ్రీనివాస్, ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ దామోదర్‌రెడ్డి చెబుతున్నారు. 
     
    వాట్సప్‌  ఉపయోగాలివీ..
    •  క్షణాల్లో ఫొటోలు, వీడియోలు, ఆడియోలు పంపవచ్చు. 
    •  ప్రపంచంలో ఏ మూల నుంచైనా  సందేశాలు పంపవచ్చు. 
    •  మిత్రులు, బంధువులు ఆపదలో ఉన్నప్పుడు ఆ విషయం తెలుసుకుని..రక్షించేందుకు ప్రయత్నించవచ్చు.
    •  ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తొలి ఏడాది ఉచితంగా వాడవచ్చు.
    •  స్మార్ట్, ఫీచర్‌ ఫోన్‌లలో అందుబాటులో ఉంటుంది.
     
    జాగ్రత్తలు తప్పనిసరి
    •  వాట్సప్‌ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
    •  ఆకతాయిలు ఫొటోలు తీసి గ్రూపులలో పెడుతుంటారు. దీనిపై నిఘా ఉంచాలి. 
    •  ఫోన్‌ ఎవరికి పడితే వారి చేతికి ఇవ్వరాదు. 
    •  ఓ పాస్‌వర్డ్‌ ఉంచుకుని సెల్‌ను వాడాలి.
     
     
    వేగంగా.. వాస్తవంగా..
    వేగంగా..వాస్తవంగా ఉండే విషయాలను వాట్సప్‌ ద్వారా విలువైన సమాచారం సమాజానికి చేరవేయాలని గ్రూప్‌ తయారు చేశాను. నా ఆలోచన మంచి సత్ఫలితాలనిచ్చి ప్రముఖుల మన్ననలు పొందాను. గ్రూప్‌లో ఉన్నతాధికారులు ఉండటం ద్వారా వెంటనే సమస్యలు తెలిసిపోతోంది. – ఎం.ప్రభాకర్, గ్రూప్‌ అడ్మిన్‌
     
    ప్రశ్నించే వేదిక..
    ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఆ విషయంపై ప్రశ్నించడానికి వాట్సప్‌ ఒక మంచి వేదికగా మారింది. ఇలాంటి టెక్నాలజీ ద్వారా చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ మందికి చేరవేసే సిస్టమ్‌గా పనిచేస్తోంది. ఇది చాలా మందికి ఎంతో మేలు కలిగిస్తోంది. ఇలాంటి టెక్నాలజీ ప్రతి ఒక్కరూ మంచి కోసం ఉపయోగించుకోవాలి. – పృథ్విరాజ్, ఫార్మసీ విద్యార్థి
     
     నేరాలు అదుపు చేసేందుకు..
    ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో పోలీస్‌ శాఖకు వాట్సఫ్‌ చాలా కీలకంగా మారింది. ఏ మూలన నేరం జరిగిన క్షణాల్లో పోలీస్‌ ఉన్నతాధికారులకు తెలుస్తోంది. జిల్లాలో వాట్సప్‌ ద్వారా చాలా ఫిర్యాదులు వచ్చాయి. నేరాలు చేసిన వాళ్ల వివరాలు, గుర్తు తెలియని మృతదేహాల వివరాలు పోలీస్‌ శాఖ వాట్సప్‌ గ్రూప్‌లో పోస్టు చేయడం వల్ల సులువుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. జిల్లా పోలీస్‌ శాఖ నుంచి అధికారికంగా ఓ వాట్సన్‌ నంబర్‌ను కూడా ప్రజలకు ఇచ్చాం. దీని ద్వారా  ప్రజలు ఎక్కడ ఏం జరిగినా ఆ దానికి మెసేజ్‌ రూపంలో పంపించడానికి ఏర్పాటు చేశాం. –డీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహబూబ్‌నగర్‌ 
మరిన్ని వార్తలు