ప్రయోగమేదీ

16 Jul, 2016 19:22 IST|Sakshi

జిల్లాలో మొత్తం హైస్కూల్స్ 456.. ల్యాబ్స్ లేని స్కూళ్లు 250కి పైనే
మిగిలిన పాఠశాలల్లోనూ అరకొర పరికరాలు
అవీ బూజుపట్టి పనికిరాని దుస్థితి
పరికరాల కొనుగోలుకు నిధులివ్వని సర్కారు
చాలని నిర్వహణ నిధులు

 
ఏలూరు సిటీ : పాఠశాల విద్యలో వినూత్న మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. విద్యావ్యవస్థ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. పాఠ్యాంశాలను సైతం అభివృద్ధి చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షా విధానంలోనూ మార్పులు తెస్తున్నారు. కృత్యాధార బోధనా పద్ధతికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. కానీ.. కృత్యాధార బోధనకు అవసరమైన సౌకర్యాలు కల్పించటంలో మాత్రం సర్కారు విఫలమవుతోంది.

రూపాయి కూడా విదల్చకుండానే ఫలితాలు వచ్చేయాలనే తరహాలో వ్యవహరిస్తోంది. ఉన్నత పాఠశాలల్లో ఆధునిక సైన్‌‌స ల్యాబ్స్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినా.. వాటికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. పరీక్షల్లో 20 మార్కులు కృత్యాధార బోధనకే కేటాయించారు. సైన్‌‌స ల్యాబ్స్ ఏర్పాటు చేయకుండా విద్యార్థుల నుంచి ఫలి తాలు ఎలా రాబడతామని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
 
టెన్త్ విద్యార్థులకు కీలకం

పదో తరగతిలో మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా భౌతిక శాస్త్రం, జీవశాస్త్రానికి సంబంధించి పరీక్షలు రాయాలంటే సైన్‌‌స ల్యాబ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. సీసీఈ విధానంలో ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు బోధించాలంటే ప్రయోగశాలలు తప్పనిసరి. హైస్కూళ్లలో 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం వీటిని విధిగా ఏర్పాటు చేయటంతోపాటు, ప్రత్యేకంగా పీరియడ్స్ కేటాయించాల్సి ఉంది. టెన్త్ విద్యార్థులు ఫిజికల్ సైన్‌‌సలో 10 మార్కులు, బయాలాజికల్ సైన్‌‌సలో 10 మార్కులు సాధించాలంటే ల్యాబ్స్ ఉండాలి. జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో మొత్తం 456 హైస్కూల్స్ ఉండగా.. వాటిలో 250కి పైగా స్కూళ్లలో సైన్‌‌స ల్యాబ్‌లు లేవు.

మిగిలిన పాఠశాలల్లోనూ అరకొర పరికరాలున్నా బూజుపట్టి పనికిరాని దుస్థితికి చేరాయి. దీంతో  తూతూమంత్రంగానే తరగతులు చెబుతున్నారు. అరకొర నిధులు ఇవ్వటంతో పూర్తిస్థాయిలో సైన్‌‌స ల్యాబ్స్ ఏర్పాటు చేయలేకపోతున్నారు. టెస్ట్‌ట్యూబ్స్, బీకర్లు, రసాయనాలు, కుంభాకార కటకాలు, పుటాకార కటకాలు, మైక్రోస్కోప్, నీటి సౌకర్యం, రసాయనాలు మండించేందుకు గ్యాస్, గాలి వెలుతురు ఉండే తరగతి గదులు ఇలా ప్రత్యేకంగా ఉండాలి. సైన్‌‌స ల్యాబ్స్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలంటే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష వరకూ వెచ్చించాల్సి ఉంది.
 
ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు దేనికి
ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా కొంతమేర నిధులు మంజూరు చేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.50 వేలను నిర్వహణ గ్రాంట్‌గా విదుదల చేస్తున్నారు. ఇందులోనూ సైన్‌‌స ల్యాబ్‌కు ఇచ్చేది అతి స్వల్పమే. లైబ్రరీ, ల్యాబ్ నిర్వహణకు రూ.10వేలు, తాగునీరు, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యానికి రూ.10 వేలు, పాఠశాలలో ఏవైనా మరమ్మతులు చేసేందుకు రూ.10వేలు, పారిశుధ్యం, కంప్యూటర్స్ రూ.15వేలు, ఇతర ఖర్చులకు రూ.5 వేల చొప్పున మంజూరు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు