ఈ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలేవీ?

22 Sep, 2016 23:35 IST|Sakshi

కడప అగ్రికల్చర్‌ : రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలకు దూరమయ్యామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం గడపగడపకు వైఎస్సార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొండూరు మండలం గంగాదేవిపల్లె, ఊడవగండ్లల్లో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ కరువు నేపథ్యంలో రాజశేతుసాగర్‌ ద్వారా నీరు ఉపయోగించుకునేలా చూడాలని కోరారు. దివంగత సీఎం వైఎస్సార్‌  హయాంలో కరెంటు బిల్లులు ఎప్పుడు కూడా ఎక్కువ రాలేదని, ఈ ప్రభుత్వంలో తలకుమించిన భారంగా మారాయని పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. బీకోడూరు మండలం పెదుళ్లపల్లెలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. ప్రజలు మాట్లాడుతూ రెండున్నరేళ్లు అవుతున్నా గ్రామానికి ఒక్క పక్కాగహం మంజూరుకాలేదన్నారు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఈ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె పంచాయితీలోని అరేపల్లె, గాంధీనగర్‌ల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మరుగుదొడ్లను నిర్మించుకుంటే బిల్లులు రాలేదని మహిళలు వాపోయారు. డ్వాక్రా రుణాలు మాఫీకాక పోవడంతో వడ్డీతో సహా కట్టలేకపోతున్నామని ఆవేదనతో తెలిపారు. రోడ్లు నిర్మించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
 

మరిన్ని వార్తలు