సదస్సు నిర్వహించే అర్హత ఎక్కడిది?

10 Feb, 2017 02:31 IST|Sakshi
సదస్సు నిర్వహించే అర్హత ఎక్కడిది?

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎంపై పలువురు మహిళా నేతల మండిపాటు

సాక్షి, అమరావతి: ‘మహిళల హక్కులను ఏమాత్రం కాపాడలేని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును నిర్వహించే అర్హత, హక్కు ఏమాత్రం లేదని మహిళా సంఘాలు గొంతెత్తాయి. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత–సవాళ్లు’అనే అంశంపై గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, ప్రభుత్వ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. డ్వాక్రా మహిళలకు తప్పుడు వాగ్దానం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర రాజధానిలో నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు మాత్రం డ్వాక్రా గ్రూపు సభ్యులకు ప్రాతినిథ్యం లేకుండా చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో చేసిన తీర్మానాలపై శుక్రవారం నుండి మూడు రోజుల పాటు నిర్వహించే జాతీయ మహిళా పార్లమెంటు సమావేశంలో చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేంలో మాజీ పార్లమెంటు సభ్యురాలు చెన్నుపాటి విద్య మాట్లాడుతూ మహిళలు సంఘటితం కావాలన్నారు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో రాష్ట్రానికి చెందిన మహిళా నేతలకు ప్రాతినిథ్యం కల్పించకపోవడం దురదృష్టకరమని  చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నా చర్యలేవని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమనీ మహిళాలోకానికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎఫ్‌డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అక్కినేని వనజ డిమాండు చేశారు.  వైఎస్సార్‌సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పి.శ్రీలక్ష్మి మాట్లాడుతూ  డ్వాక్వా రుణమాఫీ పేరుచెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు తర్వాత అమలు చేయకుండా మహిళల్ని మోసం చేశారన్నారు.  ఇతర మహిళా నేతలు కూడా తమ ప్రసంగాల్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు