ఆమె ఎవరు?

13 Mar, 2016 10:03 IST|Sakshi
ఆమె ఎవరు?

మత బోధకుడి కేసులో టాస్క్‌ఫోర్స్ ఆరా
ట్రస్ట్ పేరిట వంచన
వీడియోతో బెదిరించి రూ.కోట్లు వసూలు
 
విజయవాడ : ట్రస్ట్ పెట్టామంటూ సహకరించమన్నారు. తమ సంస్థ ద్వారా అనాథ మహిళలకు ఆర్థిక, ఇతర సాయం చేస్తున్నట్టు నమ్మబలికారు. సరే ఏదైనా పార్టీ ఏర్పాటు చేయండంటూ మత బోధకుడు అన్నందుకు ‘సర్వం’ సమకూర్చి అదిరిపోయే పార్టీ ఏర్పాటు చేశారు.
 
అంతే వీడియో చిత్రీకరించి కోట్లు దండుకున్నారు. పథకం రచన చేసింది ఎలక్ట్రానిక్ మీడియా మాజీ విలేకరులైతే.. అమలు చేసింది మాత్రం  శాటిలైట్ ఛానల్ ప్రతిని ధులు అని పోలీసు వర్గాల సమాచారం. కొందరు న్యాయవాదులు సహా ఈ కుట్రలో అనేక మంది ఉన్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఇప్పుడు మత బోధకుడిని ట్రాప్ చేసేందుకు బ్లాక్‌మెయిలింగ్ ముఠా ఏర్పాటు చేసిన యువతి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు సహా 12మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కీలక పాత్ర ఎవరిది?
మత బోధకుడికి పార్టీ చేసినప్పుడు తీసుకొచ్చిన యువతి ఎవరనేది తెలిస్తే బ్లాక్‌మెయిలింగ్ ముఠాకు సంబంధించి మరికొన్ని వివరాలు వెలుగు చూస్తాయని టాస్క్‌ఫోర్స్ అధికారులు అంటున్నారు. వీరి ఆమెను ఏ విధంగా ఆ పార్టీలో ఉపయోగించుకున్నారు? పార్టీ ఏర్పాటు చేసిన వారిలో కీలకం ఎవరు? తదితర అంశాలు రాబట్టాల్సి ఉందంటున్నారు.

ఒక్క మత బోధకుడితోనే సరిపెట్టారా లేక ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకున్నాయా? అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ముఠా చేసిన ఆగడాలన్నిం టిని వెలికి తీయాలంటూ పోలీసు కమిషనర్ ఆదేశించడంతో ముందుగా ఆ యువతిని పట్టుకోవాలనేది టాస్క్‌ఫోర్స్ ఆలోచన. ఆమె పట్టుబడితే అనేక కీలక విషయాలు వెలుగు చూస్తాయంటున్నారు.
 
విరాళం కోసం కలిశారు...
మత బోధకుడి ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉన్న మాజీ విలేకరి, మరికొందరు కలిసి డొనేషన్ కోసం కలిశారు. పదే పదే వెళ్లి కలవడంతో విరాళం ఇచ్చేందుకు మత బోధకుడు అంగీకరించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఏదైనా మంచి పార్టీ ఏర్పాటు చేయండి అంటూ ఆయన చెప్పగా వీరు సరేనన్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఓ యువతిని ఎరగా వేసి వీడియోలు చిత్రీకరించారు. ఆపై వాటిని చూపించి దశల వారీగా రూ.2 కోట్ల వరకు వసూలు చేశారు. మరో రూ.5 కోట్లు కావాలంటూ ఈ ముఠా ఒత్తిడి తేవడంతో విధిలేని స్థితిలో మత బోధకుడు నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను ఆశ్రయించగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
 
మరో మహిళకు బెదిరింపు
నగరానికి చెందిన మరో మహిళను కూడా ముఠా సభ్యులు బెదిరించి రూ. లక్షలు గుంజినట్టు తెలిసింది. ఓ గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న ఆమె మత బోధకుడితో సన్నిహితంగా ఉండటం గుర్తించిన ముఠా సభ్యులు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగా రు. విధిలేని స్థితిలో ఆమె వీరికి రూ.16 లక్షల వరకు ముట్టచెప్పినట్టు తెలిసింది.
 
ఒత్తిళ్లు
ఎలక్ట్రానిక్ మీడియా ముసుగులో బ్లాక్‌మెయిలింగ్ దందాకు పాల్పడిన కొందరు వ్యక్తుల పేర్లు వెలుగులోకి రావడంపై జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి ఆరా తీసినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఆరోపణలు వచ్చిన వ్యక్తుల ప్రమే యం ఉంటే తనకు తెలియకుండా చర్యలు తీసుకోరాదంటూ సైడ్ చేయాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు సమాచారం.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు