వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

24 Nov, 2015 07:57 IST|Sakshi
వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఏడు గంటలలోపే వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న సిబ్బంది.. మొదట పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించారు. 8 గంటలకు ఈవీఎంలను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

 

మొదటి రౌండ్ ఫలితం 9:30కు వెలువడే అవకాశం ఉంది.మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఏనుమాముల మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

 

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 80 మంది చొప్పున సిబ్బంది లెక్కింపులో పాల్గొంటారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 600 మంది సిబ్బందిని నియమించినట్లు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి వాకాటి కరుణ తెలిపారు. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

10 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్‌లో 15,09,671 మంది ఓటర్లు ఉండగా.. ఎన్నికలో 10,35,656 మంది(69.19 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. 23 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, వామపక్ష కూటమి అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. లోక్‌సభ సెగ్మెంట్‌లో మొత్తం 1,178 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా 297 పోలింగ్ కేంద్రాలున్నాయి.

 

ఇక్కడ 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో 19 రౌండ్లు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మిగిలిన నియోజకవర్గాల్లో 18 రౌండ్లలో ఫలితాలు వెలువ డుతాయి. ఉప ఎన్నిక ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఫలితాల సరళి ఆధారంగా రాష్ట్ర రాజకీయాలు మారనున్నాయి.

మరిన్ని వార్తలు