కేసులెందుకు నమోదు చేయడం లేదు?

30 Aug, 2016 00:27 IST|Sakshi
కేసులెందుకు నమోదు చేయడం లేదు?
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ఇటీవల జిల్లాలో చాలాచోట్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నా.. కేసులు నమోదు చేయకుండా జాప్యం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని నిజామాబాద్‌ కలెక్టర్‌ యోగితా రాణా ప్రశ్నించారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు, పౌర సరఫరాల సంస్థ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, గోడౌన్ల ఇన్‌చార్జి అధికారులతో ప్రగతిభవన్‌లో కలెక్టర్‌ యోగితారాణా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 22న అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నా ఆర్మూర్‌ వద్ద పట్టుకున్నప్పటికీ ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 6–ఏ తో పాటు క్రిమినల్‌ కేసు నమోదు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిసున్నారని మండిపడ్డారు. కేసులు నమోదు చేయకుండా జాప్యం చేస్తూ ఎవరితో చర్చలు జరుపుతున్నారని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు ఉద్యోగులు నిర్వహించిన విధుల టూర్‌ డైరీలను అందజేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కృష్ణ ప్రసాద్‌ను ఆదేశించారు. 
రేషన్‌ కార్డుల కోసం పేదలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ, ఆన్‌లైన్‌లో వారి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు డిప్యూటీ తహసీల్దార్లకు సమయం లేదా అంటూ కలెక్టర్‌ మండిపడ్డారు. నిత్యావసర వస్తువులు ప్రజలకు సక్రమంగా చేరే విధంగా చూడాల్సిన బాధ్యత డీటీలదేనన్నారు. తమ పరిధిలోని రేషన్‌షాపులను నిరంతరం పర్యవేక్షించాలని, సరుకుల నిలువలను ప్రదర్శింపచేయాలని ఆదేశించారు. 
6–ఎ కేసులు నెలకు ఒకటి, రెండు మాత్రమే నమోదు చేయడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతా సక్రమంగా ఉంటే మండలానికి ఒక డిప్యూటీ తహసీల్దార్‌ అవసరం లేదన్నారు. ఉద్యోగుల పనితీరుపై ఎటువంటి పర్యవేక్షణ లేదని డీఎస్‌వో వ్యవహర శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ విధానంలో డిప్యూటీ తహసీల్దార్‌ల హాజరును నమోదు చేయించాలని ఆదేశించారు. మంజూరైన రేషన్‌కార్డుల పంపిణీ అంశాన్ని తహసీల్దార్లు చూసుకుంటారన్నారు. సమావేశంలో జేసీ రవీందర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు