వితంతు పింఛన్‌ రద్దు చేస్తూ సిఫార్సు

10 Oct, 2016 23:24 IST|Sakshi
వితంతు పింఛన్‌ అని ఆమెకు తెలియదట!  l
సొమ్ము వెనక్కి ఇచ్చేసిన సత్యవతి
కాకినాడ : ‘పదవి పదిలం–పింఛన్‌ కోసం మరణం’ శీర్షికన ఈ నెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆలీమ్‌బాషా స్పందించారు. 32వ డివిజన్‌ జన్మభూమి కమిటీ సభ్యుడు మేడిశెట్టి అప్పలరాజు తన భార్యపేరిట వితంతు పింఛన్‌ మంజూరు చేయించుకున్న అంశంపై సంబంధిత విభాగాన్ని విచారణకు ఆదేశించారు. దీంతో టీపీఆర్వో భాస్కరరా వు, కింది స్థాయి సిబ్బంది అసలా పింఛన్‌ ఎలా మంజూ రైంది? భర్త ఉండగానే ఆమె పేరిట వితంతు పింఛన్‌ ఎలా విడుదలైంది? ఆన్‌లైన్‌లో ఎలా పంపారు? అనే అంశాలపై విచారణ జరిపారు. అందులో భాగంగా పింఛ న్‌ పొందిన మేడిశెట్టి సత్యవతిని కార్పొరేషన్‌ కార్యాల యానికి పిలిపించి మాట్లాడారు. వితంతు పింఛన్‌ తీసుకున్న వ్యవహారం వివాదం కావడంతో ఆమె కార్పొరేషన్‌కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చుకున్నారు. తనకు పింఛన్‌ మంజూరైందన్న సమాచారం రావడంతో Ðð ళ్లి తీసుకున్నానని, అది వితంతు పింఛన్‌ అని తనకు తెలి యదని చెప్పారు. తన భర్త అడిగితే రేషన్‌కార్డు, ఆధార్‌ జిరాక్స్‌ గతంలో ఎప్పుడో ఇచ్చానని, ఆ పింఛన్‌ ఎలా మంజూరైందో తనకు తెలియదన్నారు. పొరపాటు జరి గిందని, అందువల్ల పింఛన్‌ వెనక్కి ఇచ్చేస్తున్నానంటూ రూ.వెయ్యి నగదు కార్పొరేషన్‌ అధికారులకు అప్పగించారు. 
ప్రభుత్వానికి నివేదిక 
జన్మభూమి కమిటీ సభ్యుడు అప్పలరాజు భార్య వితంతు పింఛన్‌ వ్యవహారం బయటపడడంతో సదరు పింఛన్‌ రద్దు చేస్తూ ప్రభుత్వానికి నివేధించనున్నట్టు టీపీఆర్వో భాస్కరరావు చెప్పారు. ఈ సొమ్మును బ్యాంక్‌లో జమ చేస్తామని, వచ్చేనెల నుంచి ఆ పింఛన్‌ నిలుపుచేస్తారని తెలి పారు. సంఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం విచారణ చేస్తున్నామన్నారు.
బాధ్యులపై చర్యలేవి?
వితంతు పింఛన్‌ వ్యవహారం ఆధారాలతో బయటపడినప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో కార్పొరేషన్‌ అధికారులు వెనకడుగు వేస్తున్నారు. కేవలం పింఛన్‌ తీసుకున్న సత్యవతి నుంచి లేఖ తీసుకుని, పింఛన్‌ రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. పింఛన్‌ మంజూరు వెనుక ఉన్న ఆమె భర్త, జన్మభూమి కమిటీ సభ్యుడు అప్పలరాజు పాత్ర, పింఛను మంజూరుకు సహకరించిన కార్పొరేషన్‌లోని సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడం వల్లే ఈ వ్యవహారాన్ని అక్కడితో ముగింపు పలకాలని అధికారులు నిర్ణయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
మరిన్ని వార్తలు