అడ్డుగా ఉన్నాడనే భర్త హత్య

16 Sep, 2017 20:09 IST|Sakshi
అడ్డుగా ఉన్నాడనే భర్త హత్య

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
మహిళను అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు

చిత్తూరు అర్బన్‌ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భార్య భర్తను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. చిత్తూరులో ఇటీవల జరిగిన కె.శ్రీనివాసులు హత్య కేసులో అతని భార్య లక్ష్మి(45)ని పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం డీఎస్పీ సుబ్బారావు, సీఐ వెంకటప్ప విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న నగరంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన లారీ యజమాని శ్రీనివాసులును తానే సుత్తితో కొట్టి చంపేశానని భార్య లక్ష్మి పోలీసుల కు లొంగిపోయింది. విచారణలో మరో వ్యక్తి పాత్ర  ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

రొంపిచెర్ల మండలం మొరవపల్లెకు చెందిన ఎస్‌.బాబూలాల్‌ శ్రీనివాసులు లారీలో క్లీనర్‌గా పనిచేస్తూ తరచూ చిత్తూరులోని అతని ఇంటికి వెళ్లేవాడు. లక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనిపై శ్రీనివాసులు పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించాడు. దీంతో శ్రీనివాసులును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 11న తెల్లవారుజామున శ్రీనివాసులు నిద్రిస్తుండగా అప్పటికే పథకం ప్రకారం వచ్చిన బాబూలాల్, లక్ష్మితో కలిసి సుత్తితో కొట్టి చంపేశారు. బాబూలాల్‌ను ఊరికి పంపేసి తానే హత్య చేసినట్లు లక్ష్మి పోలీసులకు లొంగిపోయింది. అసలు విషయం గుర్తించిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. బాబూలాల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు