అడ్డుగా ఉన్నాడని హత్య

12 Sep, 2017 12:58 IST|Sakshi
వివ రాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాస్‌రావు, వెనుక నిందితులు

భర్తను చంపించిన భార్య
ప్రియుడితో కలిసి పథక రచన
కటకటాల్లోకి నిందితులు


నిజామాబాద్‌ నిజాంసాగర్‌(జుక్కల్‌) : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిందో ఇల్లాలు. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పథకం పన్నిన ఆమెను కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు. కేసు వివరాలను బాన్సువాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్సై అంతిరెడ్డి సోమవారం నిజాంసాగర్‌ ఠాణాలో విలేకరులకు వెల్లడించారు. మండలంలోని మల్లూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి నగేశ్‌ (36), భారతి దంపతులు. అదే గ్రామానికి చెందిన గూల దత్తుతో భారతికి మూడేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. భార్యపై అనుమా నం వచ్చిన నగేశ్‌ పలుమార్లు మందలిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించాలని భారతి దత్తును ప్రేరేపించింది. ఈ నెల 6న నగేశ్‌ను తీసుకొని ఊర చెరువు కట్టపైకి తీసుకెళ్లిన దత్తు అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. నగేశ్‌ మద్యం మత్తులోకి జారుకోవడంతో దత్తు అతడ్ని చెరువులోకి నెట్టివేశాడు.

కట్టపై ఉన్న మెట్లపై పడడంతో నగేశ్‌ తలకు, ముఖానికి దెబ్బలు తగిలి స్పృహ తప్పాడు. ఇదే అదనుగా భావించిన దత్తు అతడి గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని చెరువు లో పడేశాడు. భారతి ఎప్పటికప్పుడు ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ సూచనలు చేసింది. అనంతరం దత్తు అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, చెరువు కట్టపై నగేశ్‌ బైక్, చెప్పులు ఉండటంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. అప్పటికే, తన భర్త కన్పించడం లేదంటూ భారతి చుట్టుపక్కల వారికి సమాచారమిచ్చింది. ఈ క్రమంలో భారతి, నగేశ్‌లపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

అప్పటికే దత్తు పరారు కాగా, పోలీసులు అతడ్ని గాలించి పట్టుకున్నారు. విచాణరలో నగేశ్‌ను హత్య చేసినట్లు దత్తు ఒప్పుకోగా, భర్తను తానే హత్య చేయించినట్లు భారతి నేరాన్ని అంగీకరించింది. నిందితులపై హత్యనేరం కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఏఎస్సై గాంధీగౌడ్, కానిస్టేబుళ్లు గంగారాంనాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు