బెయిల్ వద్దు.. జైలుకు వెళ్తా: వంశీ

15 Feb, 2016 15:36 IST|Sakshi
బెయిల్ వద్దు.. జైలుకు వెళ్తా: వంశీ

పోలీసులు తన మీద పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా... స్వచ్ఛందంగా లొంగిపోవాలని, స్టేషన్ బెయిల్ కూడా తీసుకోకుండా జైలుకు వెళ్లాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన తన ఇద్దరు గన్‌మెన్‌ను కూడా వెనక్కి పంపారు. తన మీద కేసు పెట్టడం వెనక పార్టీలో జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఒత్తిడి ఉందని ఆయన వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వంశీని బుజ్జగించేందుకు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చల అర్జునుడు సోమవారం ఆయన ఇంటికి వెళ్లారు. అధికారులు ఏ ధైర్యంతో తన మీద కేసు పెట్టారని ఈ సందర్భంగా వంశీ వాళ్లను అడిగారు.

ధర్నాను విరమింపజేయడానికి తాను వెళ్తే.. ధర్నాలో తనను ఎ1గా పేర్కొంటూ కేసు పెట్టడం ఏంటని నిలదీశారు. కలెక్టర్ ద్వారా తన మీద కేసు పెట్టించడానికి ప్రయత్నించిన అధికార పార్టీ నేతలు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. దాంతో ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీకి ఎలాగోలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మొత్తం విషయాన్ని నేరుగా సీఎంకు వివరిస్తామని, ఆందోళన కార్యక్రమాన్ని విరమించాలని, పోలీసు స్టేషన్‌కు కూడా వెళ్లొద్దని కోరారు. కాసేపట్లో సీఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిసి అన్ని విషయాలనూ వంశీ ఆయన దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. జిల్లా కలెక్టర్‌ను కూడా క్యాంపు కార్యాలయం వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు