పనితీరు మార్చుకోండి

1 Sep, 2016 22:39 IST|Sakshi
పనితీరు మార్చుకోండి
 
  • అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు
  •  నేర సమీక్షలో ఎస్పీ విశాల్‌ గున్నీ 
నెల్లూరు(క్రైమ్‌):
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోనేది లేదు. పని తీరు మెరుగు పరచుకుని ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించండి. అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదని ఎస్పీ విశాల్‌గున్నీ సిబ్బందిని హెచ్చరించారు. స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో గురువారం ఆయన నేరసమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్‌ కేసులు  ఉండటంపై ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందని  ప్రశ్నించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. వీలైనంత త్వరితగతిన కేసులను పరిష్కరించి పెండెన్సీని తగ్గించాలన్నారు. జిల్లాలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారి వెంబడి గస్తీని ముమ్మరం చేసి నేర నియంత్రణతో పాటు ప్రమాదాల జరగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నార. గొలుసు, ఇంటి, గుళ్లలో రోజూ  దొంగతనాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు పాతనేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు. రాత్రి, పగలు గస్తీని ముమ్మరం చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే అందుకు సంబంధిత పోలీసు అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇకపై ప్రతి పోలీసుస్టేషన్‌ పనితీరును నిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు బి. శరత్‌బాబు, కె.సూరిబాబు, క్రైం ఓఎస్‌డి విఠలేశ్వర్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది  పాల్గొన్నారు. 
నోడల్‌ అధికారుల నియామకం
సిబ్బంది పని తీరును మెరుగు పరచడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా వివిధ విభాగాలను ఏర్పాటు చేసి డీఎస్పీలను నోడల్‌ అధికారులుగా నియమించారు. ఇకపై నోడల్‌ అధికారులు తమకు కేటాయించిన విభాగాలను పర్యవేక్షించి నివేదికను తనకు అందజేయాలని సూచించారు. 
 
మరిన్ని వార్తలు