హత్యలకు పాల్పడితే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తాం

26 Aug, 2016 00:20 IST|Sakshi
హత్యలకు పాల్పడితే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తాం
గూడూరు :  
 
వ్యక్తిగత కక్షలు, అనుమానాలతో హత్యలకు పాల్పడినవారిపై రౌడీషీట్‌ కేసులు ఓపెన్‌ చేస్తామని గూడూరు సీఐ బి.రమేష్‌నాయక్‌ హెచ్చరించారు. మండల కేంద్రంలోని సర్కిల్‌ కార్యాలయంలో గురువారం మండలంలోని మట్టెవాడ శివారు కొంగరగిద్దలో ఈ నెల 20న హత్యకు గురైన ఇరుప ఈశ్వర్‌ కేసులో నిందితులైన దంపతుల అరెస్టు చూపారు. సీఐ కథనం ప్రకారం.. కొంగరగిద్ద గ్రామానికి చెందిన ఈశ్వర్‌ మోటార్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడి పక్కింట్లో ఈసం నర్సయ్య, ఈరమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా నర్సయ్య భార్య ఈరమ్మ అనారోగ్యానికి గురికాగా, భర్తతో దూరంగా ఉంటోంది. పైగా రాత్రి వేళ దయ్యాలు, భూతాలు అంటూ కలవరించడం, ఓ రోజు పక్కింట్లో ఉంటున్న ఇరుప ఈశ్వర్‌ పేరు కలలో పలకడంతో, ఆ దంపతుల నడుమ గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో నర్సయ్య భూత వైద్యులను సంప్రదించగా వారు ఈశ్వర్, ఈరమ్మ మధ్య వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పంట చేనుకు వెళ్తున్న ఆ దంపతులకు మోటార్‌ మరమ్మతు కోసం వ్యవసాయబావి వద్దకు వెళ్తున్న ఈశ్వర్‌ తారసపడ్డాడు. దీంతో నర్సయ్య అతడిని ఆపి ‘ నా భార్యకు నీకు ఉన్న సంబంధం ఏమిటని’ నిలదీశాడు. అలాంటిదేమి లేదని ఈశ్వర్‌ గద్దించడంతో కోపం వచ్చిన నర్సయ్య చేతిలో ఉన్న గొడ్డలితో అతడి మెడపై నరికాడు. కిందపడిపోయిన అతడి చాతిపై మరోమారు నరకగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఎవరూ తమను చూడలేదని నిర్ధారించుకున్న దంపతులు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి మొక్కజొన్న చేనులో పడేశారు. ఈ హత్యపై ఈ నెల 21న మృతుడి అక్క మేడ కౌసల్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా నిందితులు భయపడి మట్టెవాడ సర్పంచ్‌ భర్త రేగ సాంబయ్య వద్దకు వెళ్లి నిజం ఒప్పుకున్నారు. సర్పంచ్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ రమేష్‌నాయక్‌ తెలిపారు. సమావేశంలో ఎస్సై వై.సతీష్, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, నవీన్‌ పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు