చట్టపరంగా రంగడి ఆస్తుల స్వాధీనం

1 Oct, 2016 01:29 IST|Sakshi
చట్టపరంగా రంగడి ఆస్తుల స్వాధీనం
  • రంగనాథస్వామి ఆలయ చైర్మన్‌ మంచికంటి సుధాకర్‌రావు
  •  
    నెల్లూరు(బృందావనం): రంగనాయకులపేటలో కొలువైన తల్పగిరి రంగనాథస్వామికి సంబంధించి నెల్లూరు ఏసీ సెంటర్‌లో ఉన్న  1.43ఎకరాల భూమిని చట్టపరంగా స్వాధీనం చేసుకోనున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్‌ మంచికంటి సుధాకర్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన రంగనాథస్వామి ఆలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు.  ఆలయ భూమికి సంబంధించిన 99 ఏళ్ల లీజు గడువు అక్టోబరు 6తో ముగియనున్నట్లు తెలిపారు. ఆలయ భూమిలో 43 మంది ఆక్రమణదారులు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. సెప్టంబర్‌ 17న ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. లీజు గడువు ముగియగానే ప్రభుత్వ సహకారంతో ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
    2 నుంచి నవరాత్రి ఉత్సవాలు
    రంగనాథస్వామి ఆలయంలో 2 నుంచి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంచికంటి సుధాకర్‌రావు తెలిపారు. విజయ దశమి రోజున పేట ఉత్సవం జరుపనున్నట్లు తెలిపారు. మొదటి శుక్రవారం ముత్యాలచీరలో, విజయదశమి రోజున బంగారు చీరలో అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు చింతగుంట మంగమ్మ, కాకరపర్తి జగన్‌మోహన్‌రావు, చుండి జగన్‌మోహన్, గాదంశెట్టి చంద్రశేఖర్‌రావు, వొమ్మిన జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు