ఈదురు గాలులు.. పెరిగిన ఉష్ణోగ్రతలు

21 Jan, 2017 00:06 IST|Sakshi
ఈదురు గాలులు.. పెరిగిన ఉష్ణోగ్రతలు
నరసాపురం : జిల్లాలో నాలుగు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముందెన్నడూ లేనివిధంగా శీతాకాలం మధ్యలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు ఈదురు గాలులు వీస్తున్నాయి. పగలు ఎండ.. రాత్రి చలికి ఈదురు గాలులు తోడవటంతో ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే.. గాలిలోని తేమ శాతంలోనూ భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం మంచు ప్రభావం అంతగా లేదు. డిసెంబర్‌ రెండో వారం, జనవరి మొదటి వారంలోమాత్రమే మంచు ఎక్కువగా కురిసింది. నాలుగు రోజుల నుంచి పగటిపూట ఈదురు గాలులు ప్రభావం ఎక్కువగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. శీతాకాలంలోనూ 32 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
తగ్గుతున్న తేమ శాతం
సాధారణంగా శీతాకాలంలో పగటిపూట గాలిలో తేమశాతం 50 శాతం పైనే ఉంటుంది. తెల్లవారుజామున 95 శాతంగా ఉంటుంది. మొత్తంగా శీతాకాలంలో అత్యల్పంగా 50 అత్యధికంగా 98 శాతం ఉంటుంది. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలిలో తేమశాతం పడిపోతోంది. పగటిపూట 45 శాతం, తెల్లవారుజాము సమయంలో 85 నుంచి 90శాతంగా నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. గత 15 రోజుల నుంచి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పగటిపూట అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా 28 డిగ్రీలు నమోదు చేసుకుంది. సాధారణంగా వేసవి సమీపించే కాలంలో.. అంటే ఫిబ్రవరి మొదటి, రెండు వారాల్లో గాని ఇంతగా ఉష్ణోగ్రతలు పెరగవు. ఇదిలా ఉంటే శుక్రవారం నరసాపురం ప్రాంతంలోనే పగటిపూట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో 32 డిగ్రీలు దాటింది. సహజంగా తీరప్రాంతం కావడంతో  వేసవిలో కూడా మిగిలిన ప్రాంతాల్లో పోల్చుకుంటే నరసాపురం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదవుతుంటాయి. ఇప్పుడే ఇలా ఉంటే  సంవత్సరం వేసవి ప్రభావం కాస్త ముందుగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈశాన్య రుతు పవనాల ప్రభావం
ఈశాన్య రుతుపవనాల ప్రభావం, ఉత్తర భారతం నుంచి దక్షిణ దిశకు గాలులు వీయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అండమాన్‌ దీవుల్లో ఏర్పడిన అల్పపీడనం ఈదురు గాలుల రూపంలో మన జిల్లాపై ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. మొత్తంగా వాతావరణంలో మార్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 
ఆక్వాకు కష్టమే
ప్రస్తుతం కూల్‌ అండ్‌ డ్రై అన్న రీతిలో జిల్లాలో వాతావరణం ఉంది. వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలకు మందులు వాడుతున్న వారు, చిన్నపిల్లలు ఈ వాతావరణం ఇల్ల ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధిక చలిగాలులు, గాలిలో తేమశాతం తక్కువవుతూ ఉండటం వంటి కారణాలతో ఆక్వా సాగుకూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. 
మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి
జిల్లాలో నాలుగు రోజుల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. అల్ప పీడనాలు, తుపాన్లు పట్టినప్పుడు ఎలా ఉంటుందో.. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పగటి పూట గాలిలో తేమ శాతం 45శాతం నుంచి 50 శాతం వరకు నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి. ఉత్తర ఆగ్నేయ గాలుల ప్రభావం మనపై కనిపిస్తోంది. అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కూడా మనపై ఉంది. ఈ పరిస్థితి తాత్కాలికమే. నాలుగు రోజుల తరువాత మార్పు వచ్చే అవకాశం ఉంది.
– ఎన్‌.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం
జాగ్రత్త వహించాలి
ప్రస్తుత వాతావరణం ఇబ్బందికరమే. ఆస్త్మా రోగులు జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు బయట తిరక్కూడదు. ప్రస్తుత డ్రై అండ్‌ కూల్‌ వాతావరణంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో స్వైన్‌ ఫ్లూ మరణాలు కూడా సంభవించాయి. చర్మ వ్యాధులు ఉన్నవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి.
– డాక్టర్‌ సీహెచ్‌.కృష్ట అప్పాజీ, ఎండీ, నరసాపురం 
 
 
>
మరిన్ని వార్తలు