మద్యం దుకాణం.. కాలనీల్లో దుమారం

20 Mar, 2017 23:55 IST|Sakshi
మద్యం దుకాణం.. కాలనీల్లో దుమారం
-  500 మీటర్ల ఆంక్షలతో విక్రయదారులు ఉరుకులు..పరుగులు
-  ప్రత్యామ్నాయలో భాగంగా సమీప కాలనీ వైపు చూపు
– సంసారల మధ్య వద్దంటూ మహిళల ఆందోళన
– భగవాన్‌నగర్, ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో చీపుర్లతో నిరసన
 
కర్నూలు: మద్యం వ్యాపారుల్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు గుబులు పుట్టిస్తున్నాయి. ఆరు నెలల క్రితం వరకు 100 మీటర్లకే ఉన్న ఆంక్షలు కాస్త 500 మీటర్లకు చేరడంతో కొత్త ఇలాకాల్లో  దుకాణాల ఏర్పాటుకు విక్రయదారులు వెతుకులాటలో ఉన్నారు. అయితే సంసారాల మధ్య మద్యం దుకాణాలు వద్దు అంటూ మహిళలు చాలా కాలనీల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నగరంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌ పరిధిలోని మద్యం దుకాణాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వ్యాపారులు సన్నద్దం కాగా, కల్లూరు ఎస్టేట్‌ పరిధిలోని భగవాన్‌నగర్, పోలీస్‌ కాలనీ, ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్, గ్రామ స్వరాజ్య సంఘం కాలనీ వాసులు కొంత కాలంగా అడ్డుకుంటున్నారు. ఒక్కొక్క దుకాణానికి లక్ష రూపాయల దాకా బాడుగ ఇస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటున్నప్పటికీ స్థానికంగా నివాసం ఉండే కుటుంబాల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులకు 500 మీటర్లలోపు మద్యం విక్రయాలను నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో మద్యం వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న నేపథ్యంలో నిరసనలు మొదలయ్యాయి. 
 
దిక్కుతోచని స్థితిలో వ్యాపారులు
జిల్లాలో మొత్తం 203 మద్యం దుకాణాలు, 32 బార్లు ఉన్నాయి. అందులో 164 దుకాణాలు, 16 బార్లు జాతీయ రహదారులకు 100 మీటర్ల దూరంలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి నిర్వాహకులకు ఎక్సైజ్‌ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఆంక్షల పరిధిలో ఉన్న దుకాణాలు, బార్లను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త కాలనీలకు దుకాణాలను తరలించే పనిలో  మద్యం వ్యాపారులు ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కావడంతో కచ్చితంగా అమలు చేసేందుకు ఎక్సైజ్‌ అధికారులు పట్టుదలగా ఉన్నారు. సంసారాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు కాలనీ మహిళలు నిరసన వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొంతమంది వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. భగవాన్‌ నగర్, పోలీసు కాలనీ వాసులు మద్యం దుకాణాలను అడ్డుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కల్లూరులోని పారిశ్రామిక వాడలో తమ ఇళ్ల మధ్య మద్యం దుకాణం వద్దంటూ ఆదివారం చీపుర్లతో నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో అటు వ్యాపారులకు, ఇటు ఎక్సైజ్‌ అధికారులకు సమస్య మింగుడు పడని విధంగా మారింది. 
 
ఏప్రిల్‌ నుంచి కొత్త మద్యం లైసెన్సులు:
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల పక్కన 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండాలన్న నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకరానుంది. ఈ మేరకు మద్యం షాపుల యజమానులకు కొత్త లైసెన్సులు జారీ చేసే విషయంలపై ఇటీవల విజయవాడలో ఆశాఖ మంత్రి కమిషనర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కర్నూలు డివిజన్‌ పరిధిలో 86, నంద్యాల డివిజన్‌ పరిధిలో 77 షాపులు జాతీయ రహదారుల పక్కనున్నట్లు గుర్తించి వాటికి నోటీసులు కూడా జారీ చేశారు.మిగితా 40 షాపులు మాత్రం యథావి«ధిగా కొనసాగుతాయి. వీటికి మాత్రం జూన్‌ వరకు లైసెన్సులు కొనసాగించాలని, 163 దుకాణాల మాత్రం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జాతీయ రహదారి పక్కనున్న దుకాణాలను ప్రత్యామ్నాయ కాలనీల్లో ఏర్పాటు చేయడానికి మహిళల నుంచి నిరసన వెల్లువెత్తుతుండటంతో ఎక్సైజ్‌ అధికారులకు తలనొప్పిగా మారింది.  
 
మరిన్ని వార్తలు