‘కిక్కి’రిసింది

1 Apr, 2017 00:03 IST|Sakshi
‘కిక్కి’రిసింది

అనంతపురం సెంట్రల్‌ : మద్యం టెండర్లకు ఔత్సాహికులు పోటెత్తారు. మహిళలు సైతం భారీసంఖ్యలో తరలివచ్చారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి శుక్రవారం వేలాది మంది రావడంతో అనంతపురం గుత్తిరోడ్డులోని విద్యుత్‌ కళాభారతి ఫంక‌్షన్‌ హాల్‌ కిక్కిరిసిపోయింది. జిల్లాలో 246 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు.  6,962 మంది దరఖాస్తు చేసుకున్నారు.  శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్‌ ఖాజామోహిద్దీన్‌ సమక్షంలో లాటరీల ద్వారా దుకాణాలను కేటాయించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అనంతపురం, పెనుకొండ డివిజన్ల పరిధిలోని షాపులకు వేర్వేరుగా ప్రక్రియ చేపట్టారు.

దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. వందలాది మంది మహిళలు కూడా మద్యం దుకాణాల కోసం పోటీపడడం గమనార్హం. కొందరు చంటి బిడ్డలతో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి టెండర్లలో పాల్గొన్నారు. టెండర్ల సందర్భంగా ఎలాంటి గొడవలూ జరగకుండా పోలీసులు 144 సెక‌్షన్‌ అమలు చేయడంతో పాటు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ అనుసూయదేవి, సూపరింటెండెంట్లు అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రణవి తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు