నిబంధనలు బేఖాతరు

2 Jul, 2017 23:18 IST|Sakshi
నిబంధనలు బేఖాతరు
వివాదాల నడుమ వైన్‌ షాపుల లైసెన్సులు 
కొన్ని చోట్ల గుడి, బడి సమీపంలోనే షాపులు 
తెలుగు తమ్ముళ్లకు వర్తించని నిబంధనలు 
రాజమహేంద్రవరం క్రైం : వివాదాల నడుమ బ్రాందీ షాపులకు లైసెన్సుల మంజూరు జరిగింది. బ్రాందీ షాపులకు జూన్‌ 30తో గడువు ముగిసి జూలై 1 నుంచి కొత్తగా లైసెన్స్‌లు తీసుకున్న వారు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఈ నెల నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 534 బ్రాందీషాపులకు, 42 బార్‌లు, స్టార్‌ హోటళ్లకు లైసెన్సులు మంజూరు చేశారు. ఆదివారానికి జిల్లాలో 175 బ్రాందీ షాపుల యజమానులు, 3 బార్‌లకు లైసెన్సులు తీసుకున్నారు. ఇంకా బ్రాందీ షాపులు లైసెన్సులు తీసుకోవాల్సి ఉన్నాయి. తీసుకున్న కొన్ని షాపులతో పాటు, పాత బ్రాందీషాపులకు కొన్ని వివాదాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా గుడి, బడి, హాస్పటల్స్‌ చూడకుండా ఎక్సైజ్‌ అధికారులు లైసెన్సులు ఇవ్వడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. 
నిబంధనలకు విరుద్ధంగా 
ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం బ్రాందీ షాపులకు లైసెన్సులు మంజూరు చేయాలంటే దేవాలయాలు, పాఠశాలలు, హాస్పటల్స్, జాతీయ నాయకుల విగ్రహాలకు 100 మీటర్ల దూరంలో ఇవ్వాలి. దీనితో పాటు స్థానికుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. యజమానులు స్థానికుల అనుమతులు తీసుకోకుండానే షాపులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికుల సంతకాలు ఫోర్జరీ చేసి వారి అనుమతి ఉందని ఎక్సైజ్‌ అధికారులను నమ్మిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే బ్రాందీషాపులకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. బ్రాందీషాపులు ఏర్పాటు చేసిన తరువాత స్దానికులు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా షాపులు తొలగించడం లేదు. చేసేది లేక బ్రాందీషాపులు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే కాలం వెళ్లదీస్తున్నారు. 
రామమందిరం సమీపంలో బ్రాందీ షాపు
కొత్తగా ఇచ్చిన బ్రాందీషాపుల లైసెన్సులలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. రాజమహేంద్రవరం, ఆనాల వెంకట అప్పారావు రోడ్డులో కోదండరామ దేవాలయం సమీపంలో దేవసాయి వైన్స్‌కు అనుమతి ఇచ్చారు. ఈ షాపులు ఏర్పాటు చేయడానికి స్థానిక కోదండరామ దేవాలయం కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. అయినా షాపు యథాతథంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. గతంలో జాంపేట మార్కెట్‌ వద్ద ఉన్న పీఎస్‌ వైన్స్‌ ఏర్పాటులో స్థానిక ముస్లిం కుటుంబాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా స్థానికుల అభ్యంతరాలు పక్కన పెట్టి మళ్లీ ఎక్సైజ్‌ అధికారులు లైసెన్సును మంజూరు చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బ్రాందీషాపును తరలించాలని పోరాటం చేస్తుంటే ఏటా షాపునకు లైసెన్సులు ఇస్తున్నారని పేర్కొంటున్నారు. దానవాయిపేటలోని చిన గాంధీ బొమ్మ వద్ద ఎస్‌వీఎస్‌ వైన్స్‌ ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ విగ్రహం ఎదురుగా బ్రాందీషాపు ఏర్పాటుపై అభ్యతరం వ్యక్తం చేసినా ఎక్సైజ్‌ అధికారులు తిరిగి మళ్లీ లైసెన్సులు ఇచ్చి నిబంధనలు తుంగలో తొక్కారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఇచ్చిన లైసెన్సులపై వివాదాలు వ్యక్తమవుతున్నాయి. 
మరిన్ని వార్తలు