నిబంధనలు మీరితే మద్యం షాపుల సీజ్‌

22 Aug, 2017 23:42 IST|Sakshi
దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు 
తాడేపల్లిగూడెం : 
నిబంధనలు మీరి మద్యం విక్రయిస్తే ఆయా షాపులను సీజ్‌ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో సమావేశం నిర్వహించారు. బెల్టు దుకాణాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా, దుకాణాల బయట మద్యం తాగేవారు ఎక్కువుగా ఉన్నట్టు చెప్పారు. దుకాణాల వద్ద లూజు విక్రయాలను అరికట్టాలన్నారు.  ప్రజల సూచనల మేరకు పర్మిట్‌ రూమ్‌ల రద్దుకు సీఎం చంద్రబాబును కోరనున్నట్టు చెప్పారు. మద్యం దుకాణాల ఎదుట వినియోగించిన ప్లాస్టిక్‌ గ్లాసులు కనిపిస్తే షాపులకు తాళం వేయాలని ఎక్సైజ్‌ సీఐ ఆర్‌బీ పెద్దిరాజును ఆదేశించారు. గూడెంను ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మార్చడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తోపుడు బండ్లు, కిరాణా, పండ్ల వ్యాపారులు, హోటల్స్‌ యజమానులతో సమావేశం నిర్వహించి ప్లాస్టిక్‌ కవర్లు వాడకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి పట్టణ శివారు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో రేవులు ఏర్పాటు చేయాలని, క్రేన్‌ల సాయంతో కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. 7, 9, 11వ రోజుల్లో నిమజ్జనాలను నిర్వహిస్తారన్నారు. లారీలను పార్కింగ్‌ ప్రాంతాల్లోనే నిలుపుదల చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు నరిశే సోమేశ్వరరావు. పోతుల అన్నవరం పాల్గొన్నారు. అంతకు ముందు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
 
మరిన్ని వార్తలు