రూ.7.12 కోట్లతో యాదాద్రి భవన్

24 Nov, 2015 00:23 IST|Sakshi

నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి అల్లోల
పాల్గొన్న మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి
 
 హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురలో ఏర్పాటు చేయనున్న యాదాద్రి భవన్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భూమి పూజ చేశారు. రూ.7.12 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. యాదాద్రి నిధులతో చేపడుతున్న ఈ భవన నిర్మాణ పనులను సిరికో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించినట్లు మంత్రి చెప్పారు. భవనంలో యాదాద్రి సమాచార కేంద్రంతో పాటు పెళ్లి మండపం, వేడుకలు నిర్వహించుకోవడానికి 500 మంది సరిపోయేలా అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం(యాదగిరిగుట్ట), నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన 2016 సంవత్సరం క్యాలెండర్‌ను నాయిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ఎన్.శివశంకర్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, సిరికో ప్రాజెక్ట్సు ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు