కృష్ణా, పెన్నాలను అనుసంధానం చేస్తా

31 Oct, 2015 01:31 IST|Sakshi
కృష్ణా, పెన్నాలను అనుసంధానం చేస్తా

♦ డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి వడ్డీ మాఫీ
♦ నెల్లూరు జిల్లా పొదలకూరు బహిరంగసభలో సీఎం చంద్రబాబు
 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 కోట్లతో కండలేరు ఎడమకాల్వ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జెడ్పీ ఉన్నతపాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. నీటిని ఎలా వాడుకోవాలో త్వరలోనే ‘వైట్‌పేపర్’ను విడుదల చేస్తామని తెలిపారు. కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తే నెల్లూరు జిల్లాకు కరువనే సమస్యే ఉండదన్నారు.

 కారిడార్‌గా కృష్ణపట్నం
 కృష్ణపట్నం పోర్టును ఒక గొప్ప కారిడార్‌గా తీసుకురానున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. క్రిబ్‌కో, కంటైనర్ కేంద్రం, మానసిక వికలాంగుల కేంద్రం, జాతీయ కామధేను, తుపాను కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీతోపాటు ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రంతో సంప్రదిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. డెఫిసిట్ కింద కేంద్రం డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నారు.

 డ్వాక్రా మహిళలకు రూ.1,500 కోట్ల వడ్డీమాఫీ
 రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి రూ.1,500 కోట్ల వడ్డీని మాఫీ చేసినట్లు సీఎం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల కోసం 50 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. మంత్రులు దేవినేని ఉమ, శిద్దా రాఘవరావు, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు