ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

3 Sep, 2016 23:59 IST|Sakshi
– కొత్తపేట ఎంపీటీసీ ఏకగ్రీవం
– మూడు సర్పంచ్‌లు, 9వార్డు సభ్యులకు ఎన్నికలు
– ప్రచారంలోకి అభ్యర్థులు 
జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) : జిల్లాలో మూడు సర్పంచ్, 47వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పోటీలో ఉండే అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సోమవారం నామినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. మంగళవారం పరిశీలించారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. బాలనగర్‌ మండలం నేరెళ్లపల్లి సర్పంచ్‌ స్థానానికి 6 నామినేషన్లు రాగా ఒక్కరు తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా మిగిలిన ఐదుగురు బరిలో నిలిచారు. కోయిలకొండ మండలలోని బూర్గుపల్లి సర్పంచ్‌ స్థానానికి మూడు నామినేషన్లు రాగా  ఒక్కరు ఉపసంహరించుకున్నారు. ఇద్దరు బరిలో ఉన్నారు. మద్దూర్‌ మండలంలోని పల్లెర్ల గ్రామానికి ఐదు నామినేషన్లు రాగా ఇద్దరు ఉపసంహరించుకున్నారు. ముగ్గురు బరిలో నిలిచారు. మొత్తం 47వార్డు సభ్యులకు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. 37 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో హన్వాడ మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 9స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో సీకేపల్లి, వటవర్లపల్లి, చిన్నతాండ్రపాడు, కుమార్‌లింగంపల్లి, పెద్దనందిగామ, నాచారం, బాలానగర్, శ్రీరంగాపూర్, బొక్కలోనిపల్లి గ్రామాల్లో వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. కాగా కేశంపేట మండలంలోని కొత్తపేట ఎంపీటీసీ ఎన్నిక ఏకగ్రీవమయింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో 8వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు.  
 
మరిన్ని వార్తలు