పోలీసు బలగాలను వెనక్కి తీసుకోండి

30 Aug, 2016 22:22 IST|Sakshi
పోలీసు బలగాలను వెనక్కి తీసుకోండి

సాక్షి, సిటీబ్యూరో: మల్లన్న సాగర్‌ ప్రాంతంలో మోహరించిన పోలీసు బలగాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని భూ నిర్వాసితుల పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. మల్లన్నసాగర్‌ ప్రాంతంలో 144 సెక్షన్‌ను తొలగించాలని కోరారు. జీవో 123 ప్రకారం భూమి కొనుగోళ్లు ఆపివేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని వక్తలు అభిప్రాయపడ్డారు.

జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ రైతుల రక్తం కళ్లజూసిన పాలకులు ఎంతోకాలం అధికారంలో ఉండరని చరిత్ర రుజువు చేసిందన్నారు. ఎమర్జెన్సీ విధించి, పౌర హక్కులను కాలరాయాలనుకున్న ఇందిరాగాంధీ సైతం ఓటమి పాలవక తప్పలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ నాయకుడు కోదండరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛందంగా అసెంబ్లీలో దీనిపై చర్చిస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారని అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో తెలంగాణలో వేలాది మంది రైతులు భిక్షగాళ్లుగా మారాల్సి వచ్చిందన్నారు.

వేముల ఘాట్‌ ఇప్పుడు పాకిస్థాన్‌ సరిహద్దులను తలపిస్తోందని తెలంగాణ రైతు కూలీ సంఘ నాయకులు వెంకట్‌ అన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు, పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 1న తలపెట్టిన ఆందోళనను విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు రాములు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర అధ్యక్షురాలు పశ్య పద్మ, సజయ, రమా మెల్కొటే, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ కుమార్, దళిత బహుజన్‌ ఫ్రంట్‌ నేత శంకర్, పిట్టల రవీందర్, గాదె ఇన్నయ్య, ఉషాసీతాలక్ష్మి, విమల, పీఓడబ్లు్య సంధ్య, తెలంగాణ రైతు సంఘ ప్రతినిధి సాగర్, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి విస్సా కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు