ఐసీయూ సెటప్.. అంతా బిల్డప్!

17 Feb, 2016 02:39 IST|Sakshi
ఐసీయూ యూనిట్ ను పరిశీలిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి (ఫైల్)

అధికారుల తీరుతో వైద్య ఆరోగ్య శాఖ అభాసుపాలు
మహబూబ్‌నగర్‌లో ప్రారంభించిన వెంటనే పరికరాలను తీసుకెళ్లిన వైనం
మళ్లీ డెమో పరికరాలతోనే సిద్దిపేట, కరీంనగర్‌లో ఏర్పాటుకు సన్నాహాలు?


సాక్షి, హైదరాబాద్: ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ సిని మాలో తల్లిదండ్రులను బాధపెట్టొద్దని హీరో వైద్యుడిగా అవతారం ఎత్తుతాడు. అందుకు ఓ ఆసుపత్రి సెటప్ చేస్తాడు! ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కూడా దాదాపు అలాగే ఫీట్లు చేస్తోంది. అన్ని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల(ఐసీయూ)ను ఏర్పా టు చేస్తామని హామీ ఇచ్చిన ఈ శాఖ.. అందుకు ఒక్కో యూనిట్‌కు రూ.కోటి వరకు ఖర్చు చేయాలని నిర్ణయించింది. టెండర్లు కూడా పిలిచారు. కానీ టెండర్లు ఖరారు కాలేదు. అధికారులు మాత్రం హడావుడికి తెర లేపారు. వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ నెల 3న మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో 8 పడకలతో ఐసీయూ యూనిట్‌ను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. అవి డెమో ఐసీయూ పరికరాలు కావడంతో కంపెనీ వాళ్లు... వాటిని వెంటనే తీసుకెళ్లిపోయారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన వెంటిలేటర్లను కూడా తరలించుకుపోయారు. ఐసీయూ పరికరాలను కొనుగోలు చేయకుండానే ఇలా ఎగ్జిబిషన్‌లో వస్తువుల్లా ఆర్భాటంగా వాటిని ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 25న మెదక్ జిల్లా సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలోనూ ఐసీయూల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ కూడా డెమో ఐసీయూలే ఏర్పాటు చేస్తారన్న ప్రచారం ఉంది.

ప్రణాళిక లేని వైద్య ఆరోగ్యశాఖ

ఐసీయూ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఏమాత్రం ముందస్తు ఏర్పాట్లు లేకుండా మహబూబ్‌నగర్‌లో డెమో ఐసీయూలను ఏర్పాటు చేయడంతో ఆ శాఖ పరువు బజారున పడింది. అంతేకాదు ప్రారంభించిన తర్వాత ఐసీయూ యూనిట్‌కు తాళం వేశారు. అంతకుముందు ఫొటోల కోసమే రోగులను కాసేపు ఉంచారన్న విమర్శలు వచ్చాయి. ఐసీయూల కొనుగోలుకు టెండర్లు పిలిచినా వాటిని త్వరగా ఖరారు చేయడంలో వైఫల్యం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. టెండర్లు ఖరారు చేయడంలో ఈ సంస్థ పూర్తిగా విఫలమైంది. తాత్కాలికంగా డెమోలతో పని కానిచ్చేలా సంస్థ అధికారుల వ్యవహారం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తమకు ఇష్టమైన కంపెనీలకే టెండర్ వచ్చేలా టెండర్లు ఖరారు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల ఆసుపత్రి ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించిన ఒక టెండర్‌లో మూడు కంపెనీలు పాల్గొంటే... తమకు ఇష్టమైన కంపెనీకి వచ్చేలా సింగిల్ టెండర్ తీశారు. మిగిలిన వాటికి సంబంధించి ఏదో సాంకేతిక కారణాలు చూపి పక్కనపెట్టారు. అంటే నామినేషన్ పద్ధతిలో ఇష్టమైన వారికి కాంట్రాక్టు ఇచ్చినట్లుగానే వారి వ్యవహార శైలి ఉంది. మొత్తం వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు