ప్రసవ వే‘ధన’!

1 Mar, 2016 03:17 IST|Sakshi

పండంటి బిడ్డ కోసం కలలు కంటారు. సుఖ ప్రసవం కోసం ఆస్పత్రిని ఆశ్రయిస్తారు. వైద్యులు చెప్పింది అమాయకంగా వింటారు. శస్త్రచికిత్స చేస్తే తప్ప బిడ్డ దక్కడంటే బెంబేలెత్తుతారు. అడిగినంత చేతిలో పోస్తారు. ఒళ్లు గుల్లవుతుంది. శస్త్రచికిత్స పూర్తవుతుంది. చేతి చమురు వదులుతుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ శస్త్రచికిత్సల సంఖ్య పెరిగిపోయింది. అవసరం లేకపోయినా చేస్తున్న శస్త్రచికిత్సలతో గర్భిణుల ఆరోగ్యం దిగజారుతోంది.
 
* అవసరం లేకున్నా సిజేరియన్ శస్త్రచికిత్సలు
* ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణుల నిలువు దోపిడీ
* రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు వసూలు
* ప్రసవాల్లో సగం సిజేరియన్లే

 
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లు అధికంగా జరుగుతున్నాయి. సిజేరియన్ నిమత్తం ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆస్పత్రికి రాగానే బిడ్డ అడ్డం తిరిగిందని, ఉమ్మి నీరు తక్కువుగా ఉందని.. ఇలా అనేక కుంటి సాకులు చెప్పి గర్భిణులను భయపెడుతున్నారు. దీంతో గత్యంతరం లేక వైద్యులు చెప్పినట్టు వారు చేయాల్సి వస్తోంది.
 
ప్రైవేటు ఆస్పత్రుల్లో అధికం

ప్రభుత్వాస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లు సగానికి పైగా ఉండటం గమనార్హం. జిల్లాలో ప్రసవాలు జరిగే ప్రభుత్వాస్పత్రులు 57, ప్రైవేటు ఆస్పత్రులు 48 ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి జనవరి నెలాఖరుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 13,234 ప్రసవాలు, కేవలం 4021 సిజేరియన్లు జరిగాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో 6908 ప్రసవాలు జరిగితే, అందులో 4526 సిజేరియన్లు జరగడం గమనార్హం.
 
సిజేరియన్‌తో నష్టం
ఒకసారి సిజేరియన్ చేస్తే రెండోసారి కూడా సిజేరియన్ చేయాలి. సిజేరియన్ చేయడం వల్ల మహిళలు నడుం నొప్పి, కాళ్లు నొప్పులు తదితర వ్యాధుల బారిన పడతారు. సాధారణ ప్రసవమైతే రక్తస్రావం తక్కువగా జరుగుతుంది. అదే సిజేరియన్ అయితే అధికంగా జరుగుతుంది. దీని వల్ల మహిళలు రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉంది. సాధారణ ప్రసవమైతే కేవలం రూ.5 వేల నుంచి రూ.10 వేలు వస్తుంది. సిజేరియన్ అయితే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కార్పొరేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి.
 
పర్యవేక్షణ కరువు
జిల్లాలో ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తున్నా పర్యవేక్షించే నాథుడే లేడు. ఇదే విషయాన్ని డిఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి వద్ద ప్రస్తావించగా సిజేరియన్లు అధికంగా చేస్తున్నట్టు  తెలిసిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు