భర్తే కడతేర్చాడు

5 Jul, 2016 08:42 IST|Sakshi
భర్తే కడతేర్చాడు

తాండూరు: మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. భర్తే ఆమెను కుటుంబీకులతో కలిసి చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. తాండూరు రూరల్ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. భర్త అనుమానంతో అంతమొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది.  సోమవారం రూరల్ సీఐ సైదిరెడ్డితో కలిసి తన కార్యాలయంలో తాండూరు ఏఎస్పీ చందనదీప్తి కేసు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మంజుల(24)కు గతంలో పెళ్లి అయింది. అనంతరం విభేదాలతో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది.

2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. సంగారెడ్డిలోని గణేష్‌నగర్‌కు చెందిన బీటెక్ చదివిన యాదవ గోటూరు మహేష్ కూడా 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ సమయంలో వీరికి పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇరువర్గాల నుంచి అభ్యంతరం రావడంతో గతేడాది అక్టోబర్ 18న యాదగిరిగుట్టకు వెళ్లి వివాహం చేసుకున్నారు. పటాన్‌చెరువు ఇక్రిశాట్ సంస్థ సమీపంలో అద్దెకు ఉంటున్న దంపతులు పటాన్‌చెరువు ఎక్సైజ్ ఠాణాలో పనిచేస్తున్నారు. 

 మంజులను ఇలా చంపేశారు..
మంజులపై అనుమానం పెంచుకున్న మహేశ్ ఎలాగైనా ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో గత జూన్ 24న తెల్లవారుజామున 3 గంటలకు అతడు తన తమ్ముడు సతీష్(బీటెక్ విద్యార్థి), బావ మల్లేష్‌తో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న మంజులను అంతమొందించాడు. పటాన్‌చెరువుకు చెందిన ఆటో డ్రైవర్లు  యాదగిరి, నర్సింలు సాయం తీసుకున్నారు. ఆటోడ్రైవర్లను కాపాలాగా ఉండగా వీరు చంపేశారు. తమ్ముడు, బావ మంజుల కాళ్లు,చేతులు పట్టుకోగా మహేష్ టవల్‌తో మంజులకు ఊపిరి ఆడకుండా చేసి అంతమొందించాడు.

 రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
అనంతరం మృతదేహాన్ని ఆటోలో రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్ సమీపంలోకి తీసుకువచ్చి పడేశారు. ఆటోను మహేశ్‌తోపాటు ఇతరులు బైక్‌లపై అనుసరించారు. మంజుల రోడ్డు ప్రమాదంతో మృతిచెందినట్లు చిత్రీకరించారు. ఈక్రమంలో బైక్‌ను కింద పడేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

 ఎస్‌ఐ ప్రిలిమినరీకి క్వాలిఫై..
మంజుల ఎస్‌ఐ ఉద్యోగం ప్రిలిమినరీ పరీక్షకు ఎంపికైనందున తాండూరులోని భూకైలాస్ దేవాలయానికి వెళుతుండగా అడవిపంది ఢీకొట్టడంతో ఆమె కిందపడి మృతిచెందిందని, తనకు గాయాలయ్యాయని మహేశ్ పోలీసుల విచారణలో తెలిపాడు. తన కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని మంజుల తండ్రి పొట్టిపల్లి నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మంజుల, మహేశ్ దంపతుల మధ్య గొడవలు ఉన్నట్లు తేలింది.

మరిన్ని వార్తలు