రోడ్డుపైనే మహిళ ప్రసవం

30 Jun, 2017 23:57 IST|Sakshi
రోడ్డుపైనే మహిళ ప్రసవం

పుట్లూరు (శింగనమల) : అంబులెన్స్‌ రావడం ఆలస్యం కావడంతో ఓ మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. స్థానిక మహిళలు ఆమెకు పురుడు పోశారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. పుట్లూరు మండలం శనగలగూడూరు ఎస్సీ కాలనీకి చెందిన గీత, నాగేశ్వర్‌ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. గీత నాలుగోసారి గర్భం దాల్చడంతో స్వగ్రామం వచ్చారు.

శుక్రవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం ఆశా కార్యకర్త 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అయితే అప్పటికే ఆ ఆంబులెన్స్‌ మరో కేసులో ఉండటంతో రావడానికి ఆలస్యమైంది. దీంతో ఆటోలో ఆస్పత్రికి వెళ్లడం కోసం రోడ్డు వద్దకు వచ్చిన గీత కొద్దిసేపటికే స్థానిక మహిళల సాయంతో అక్కడే ప్రసవించి అడపిల్లకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం వచ్చిన 108 సిబ్బంది తల్లీబిడ్డలను పుట్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

నాలుగు మండలాలకు ఒకే ఆంబులెన్స్
పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాలకు ఒకే 108 అంబులెన్స్‌ ఉండటంతో సకాలంలో వచ్చి ఆస్పత్రులకు తీసుకెళ్లడం ఆలస్యమవుతోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పుట్లూరులో ఒక అంబులెన్స్‌ ప్రజలకు అందుబాటులో ఉండేది. అనంతరం అంబులెన్స్‌ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రజలు ఆపద సమయంలో అవస్థలు పడాల్సిన దుష్టితి నెలకొంది.

>
మరిన్ని వార్తలు