ఘోరం..

3 Mar, 2017 22:00 IST|Sakshi
ఘోరం..

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌
బైక్‌ నడుపుతున్న యువతి దుర్మరణం
ఎనుమలవారిపల్లిలో విషాదఛాయలు


ఇంటర్‌ చదువుతున్న బంధువుల అబ్బాయిని పరీక్ష కేంద్రానికి తన ద్విచక్రవాహనంలో తీసుకెళ్లేందుకు బయల్దేరిన ఆ యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉండటమే కాక మగ పిల్లలు లేరన్న లోటును తీర్చిన ఆ యువతి తిరిగిరాని లోకాలకు చేరింది. మగరాయుడిలా అండగా ఉంటివి కద తల్లీ..అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. - నల్లమాడ (పుట్టపర్తి)

నల్లమాడ మండలం ఎన్‌.ఎనుములవారిపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రావణి అనే (17) యువతి దుర్మరణం చెందింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్‌.ఎనుములవారిపల్లికి చెందిన చిల్లా రాధమ్మ, చిన్న కుళ్లాయప్ప దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రావణి ఇంటర్‌ వరకు చదువుకొని ఇంటిపట్టునే ఉంటోంది. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆ దంపతులకు మగ సంతానం లేని లోటు తీర్చేది. శ్రావణి రెండేళ్ల నుంచి మోటార్‌ సైకిల్‌ (బైక్‌) నడుపుతూ అందరినీ ఆకట్టుకుంది.

సమీప బంధువు నరసింహనాయుడు కదిరిలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు ఆ విద్యార్థి పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఆ మార్గంలో బస్సు సౌకర్యం లేదు. సమయానికి ఆటో కూడా అందుబాటులో లేకపోవడంతో పరీక్షకు సమయం అవుతోందని శ్రావణి.. నరసింహనాయుడును ద్విచక్ర వాహనం (ఫ్యాషన్‌ ప్రో)లో ఎక్కించుకుని కదిరికి బయలుదేరింది. కిలో మీటర్‌ దూరం వెళ్లగానే బాట్లో మాను వద్ద కదిరి వైపు నుంచి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై శ్రావణి అక్కడికక్కడే మృతిచెందింది. వెనుక కూర్చున్న నరసింహనాయుడు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.

సమాచారం అందుకున్న నల్లమాడ సీఐ శివరాముడు, ఓడీ చెరువు ఎస్‌ఐ సత్యనారాయణ, నల్లమాడ ఏఎస్‌ఐ జయప్ప, ఆర్‌ఐ శ్రీధర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కదిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం స్వగ్రామంలో యువతి మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రత్యక్ష సాక్షి నరసింహనాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించామని ఏఎస్‌ఐ తెలిపారు.

బాధితురాలి కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
ప్రమాద సమాచారం తెలియగానే వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని, శ్రావణి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాతబత్తలపల్లి ఎంపీటీసీ సుకన్యాశ్రీనివాసరెడ్డి, సహకార సంఘం ఉపాధ్యక్షులు రామప్ప, మాజీ సింగిల్‌విండో డైరెక్టర్‌ రంగప్ప, శ్రీరామమూర్తి, రామిరెడ్డి, టీ.నరసింహారెడ్డి, రామక్రిష్ణారెడ్డి తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. ఎంపీడీఓ రాబర్ట్‌విల్సన్‌ కూడా యువతి మృతదేహాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు.  


కర్ణాటకలో మరో ఇద్దరు..
పావగడ : తాలూకా లోని దవడబెట్ట గ్రామానికి చెందిన గోపి నాయక(32) నాగప్ప (40)లు మధుగిరి తాలూకాకు చెందిన చిన్నేనహళ్ళి రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మధుగిరి నుంచి పావగడకు టీవీఎస్‌ విక్టర్‌ వాహనంలో వెళుతున్న వీరు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు