‘నాతో ఉంటే సరి.. లేదంటే అంతేమరి’

8 Aug, 2016 09:22 IST|Sakshi
‘నాతో ఉంటే సరి.. లేదంటే అంతేమరి’
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అతడో మాజీ కార్పొరేటర్‌. ఇంటాయన అనారోగ్యాన్ని అలుసుగా తీసుకుని ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె సెల్‌ఫోన్‌కు అసభ్య మెసేజిలు పంపించడమే కాకుండా.. నేరుగా ఇంటికెళ్లి కోరిక తీర్చమన్నాడు. లేదంటే.. ఆమె మరిది ఎదుటే రేప్‌ చేస్తానని బెదిరించాడు. దిక్కులేని స్థితిలో ఆమె ఏలూరు పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన ఖాకీలు మాజీ ప్రజాప్రతినిధిని పిలిచి విచారించారు. ఆ తరువాత నుంచి అతడు మరింత పేట్రేగిపోతున్నాడు. 
 
‘నీవు నిద్రపోకుండా సెల్‌ఫోన్‌ పట్టుకుని ఉండాల్సి వచ్చింది కదా... దటీజ్‌ శేఖర్‌. ఈ మెసేజుల్ని ఫేస్‌బుక్‌లో పెడతా. చూసి ఎంజాయ్‌ చేయాలి. నీవు ఎంత చెప్పినా మారవా.. నన్ను రాక్షసుడిగా మార్చాలని చూస్తున్నావు. నేను ఆఖరిసారిగా అడుగుతున్నా రచ్చ జరగకుండా చూడు’ ఇవి ఓ వివాహితకు రోజూ వస్తున్న ఎస్‌ఎంఎస్‌లలో ఒక భాగం. రోడ్డుపై నడుస్తుంటే ఎలా ఉంటుందో కూడా వర్ణిస్తూ ఎస్‌ఎంఎస్‌లు. ‘నా గురించి రచ్చ చేస్తే నీకు నాకూ మధ్య ఏదో ఉందని ప్రచారం చేస్తా’నంటూ బెదరింపులు. రాత్రి పూట ఇంట్లో నుంచి బయటకు రావాలంటే కూడా భయపడిపోయే పరిస్థితి. చివరకు మనశ్శాంతి కోసం గుడికి వెళ్తే అక్కడ కూడా వదలకుండా వెంటపడుతున్నాడు. ఇవన్నీ ఏదో పోకిరి చేస్తున్న చేష్టలు కాదు. ఒక మాజీ ప్రజాప్రతినిధి నిర్వాకం.
 
భర్త అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని ఒక వివాహితను వేధిస్తున్నాడో ప్రబుద్ధుడు. ఆస్తి కోసం ఆమె మరిది కూడా ఆ మాజీ ప్రజాప్రతినిధికి సహకారం అందిస్తున్నాడు. ఆ వివాహితను మానసికంగా వేధిస్తూ కామవాంఛలు తీర్చాలని వెంటపడుతున్నాడు ఏలూరుకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి. రాయడానికి కూడా వీలులేని రీతిలో ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నాడు. గత నెలలో మరిది సహాయంతో ఆమెపై అత్యాచారానికి యత్నించడంతో ఆ అభాగ్యురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
పోలీసులు వెంటనే కేసు నమోదు చేసినా అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఆ మాజీ వెంటనే బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. పోలీసులు తాము పుష్కరాల బందోబస్తులో ఉన్నామని, న్యాయం నీవైపే ఉంది కాబట్టి కొంత సమయం ఓపిక పట్టాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆ కీచకుడు ఏ క్షణంలో తన జీవితంతో చెలగాటం ఆడతాడో తెలియని పరిస్థితుల్లో ఆ అభాగ్యురాలు తల్లడిల్లుతోంది. మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌ కె.భాస్కర్‌ను కలిసి ఆ వివాహిత ఫిర్యా దు చేయగా, తక్షణమే పరిష్కరించాలంటూ డీఎస్పీని కలెక్టర్‌ ఆదేశించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. 
 
‘నాతో ఉంటే సరి.. లేదంటే అంతేమరి’
ఏలూరు తూర్పువీధికి చెందిన ఒక వివాహిత భర్త అన్‌డెఫినెటెడ్‌ స్కిజోప్రీనియా అనే వ్యాధితో కొన్నేళ్లుగా బాధపడుతున్నాడు. ఇతను చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటాడు. దీనిని అదనుగా చేసుకుని ఆ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ కౌలూరి చంద్రశేఖర్‌ ఆమెపై కన్నేశాడు. ఆమె వెంటపడుతూ ఎప్పటినుంచో నీపై కోరిక ఉంది తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. ‘నీ భర్త అమాయకుడు కాబట్టి నిన్ను ఉంచుకుంటాను. నాతో ఉంటే నీ భర్తకు రావాల్సిన ఆస్తుల వాటాలను పెద్ద మనిషిగా ఉండి సక్రమంగా ఇప్పిస్తాను. లేదంటే నీకు చిల్లిగవ్వ కూడా దక్కనివ్వ’నంటూ బెదిరింపులకు దిగాడు. ఈ వేధింపులకు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో వారి కోసం ఆ ఆలోచన మానుకుంది.
 
ఈలోగా ఆమె భర్త తమ్ముడితో ఆ మాజీ కార్పొరేటర్‌ స్నేహం పెంచుకుని ఆ వంకతో ఇంటికి వెళుతూ వేధించడం మొదలు పెట్టాడు. దీనికి మరిది కూడా వత్తాసు పలకడంతో ఆమె పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై 15 వరకూ చంద్రశేఖర్‌ తన సెల్‌ నుంచి కామవాంఛలు తీర్చాలంటూ అసభ్యకర మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ‘నీ బంధువు, అతని కుమారుడు నిన్ను చంపేయమన్నారు’ అని మెసేజీ పెట్టడంతో ఆమె ఇదే విషయం వారిని అడిగింది. దీంతో వారిద్దరూ మాజీ కార్పొరేటర్‌కు వంతపాడుతూ పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి పొమ్మనడం కొసమెరుపు. అప్పటినుంచి ఆమెపై వేధింపులు మరింత పెరిగాయి. గత నెల 15న సాయంత్రం వేళ మాజీ కార్పొరేటర్‌ చంద్రశేఖర్‌ వివాహిత మరిదితో ఆమె ఇంటికి వెళ్లాడు. ‘ఏంటీ మాటలు, మెసేజీలు ఇచ్చినా లొంగడం లేదు. అందుకే నేరుగా వచ్చాం. నీ మరిది ఎదుటే నిన్ను రేప్‌ చేస్తా’నంటూ బలాత్కరించబోయాడు.
 
దిక్కులేని పరిస్థితుల్లో ఆ వివాహిత వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను స్టేషన్‌కు పిలిపించారు. అయితే అధికార పార్టీ అండతో వారు బయటకు వచ్చేశారు. అయినా వేధింపులు ఆగలేదు. ‘కేసు పెడితే భయపడిపోతామా. నీకు దిక్కున చోట చెప్పుకో’ అంటూ బెదిరింపులకు దిగారు. వారం క్రితం మాజీ కార్పొరేటర్‌ ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగడంతో దీనిని అలుసుగా చేసుకుని తన మరిది ఆరు నెలలుగా తమకు ఇంటి అద్దెలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు ‘సాక్షి’ ఎదుట వాపోయింది. ఈ పరిస్థితుల్లో చేతిలో డబ్బులు లేక బంగారం తాకట్టు పెట్టి మరీ కుటుంబాన్ని పోషించుకోవాల్సి వ స్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా పోలీసులు స్పందించకపోతే ఏదో ఒక రోజున తనను చంపేస్తారని బాధితురాలు ఆందోళన చెందుతోంది.
మరిన్ని వార్తలు