గంగానమ్మకు గిరిజన మహిళ బలి

11 Nov, 2015 12:29 IST|Sakshi

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన వై రామవరం మండలం చింతకర్ర పాలెంలో ఓ గిరిజన మహిళను స్థానికులు బలిచ్చారు. ఆమె వల్లే తమ గ్రామానికి అరిష్టం చుట్టుకుందనే మూఢనమ్మకంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, గత కొద్ది రోజులుగా ఓ పదిమంది వ్యక్తులు ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని వారే లేని పోని నమ్మకాలు అమాయక గిరిజనులకు కల్పించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లగా చింతకర్ర గ్రామంలో గంగానమ్మ దేవత ఆలయం ఉంది.

దానికి ఎదురుగానే కేర చినలక్ష్మీ అనే గిరిజన మహిళ ఇళ్లు ఉంది. ఆమె ఆ గ్రామంలో కూలీ చేసుకొని బతుకుతుంటుంది. అయితే, ఇటీవలె ఆ గ్రామంలో ఓ సోది చెప్పే మహిళ గ్రామానికి అరిష్టం చుట్టుకుందని, అందువల్లే వర్షాలు రావడం లేదని, పంటలు పండలేదని చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారితో కూడి స్థానికులు ఆమెను గంగానమ్మ దేవతకు బలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకే ఆమెను బలిచ్చే సమయంలో చిత్ర హింసలకు గురిచేసేముందు ఎన్ని అరుపులు అరిచినా కనీసం ఒక్కరు కూడా సహాయం చేసేందుకు రాలేదు అని తెలుస్తోంది. ఆమె శరీరంపై కర్పూరం పెట్టి గాయపరిచారని, అనంతరం తలపై చెంబుతో బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు