నంద్యాల, ఆదోనిలో మహిళా పోలీస్‌స్టేషన్లు

11 Jul, 2017 00:04 IST|Sakshi
 – జిల్లాలో 4600 కేసులు పెండింగ్‌
– చోరీ కేసుల రికవరీకి ప్రత్యేక బృందాలు
– సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
 – జిల్లా ఎస్పీ గోపినాథ్‌ జట్టి వెల్లడి
 
కోవెలకుంట్ల: జిల్లాలోని నంద్యాల, ఆదోని పట్టణాల్లో మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు జిల్లా ఎస్పీ గోపినాథ్‌ జట్టి చెప్పారు. సోమవారం సాయంత్రం స్థానిక సర్కిల్‌ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ  స్టేషన్లకు వచ్చే మహిళా కేసుల ఆధారంగా మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4600 కేసుల పెండింగ్‌లో ఉండగా వీటిలో 300 మిస్సింగ్‌ కేసులు ఉన్నాయన్నారు.  మూడు నెలల వ్యవధిలో ఈ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు వెల్లడించారు.
 
పెండింగ్‌లో ఉన్న చోరీ కేసుల్లో పురోగతి సాధించేందుకు సబ్‌ డివిజన్‌ స్థాయిలో ప్రత్యేక బృందాలుఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా  రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారు ప్రమాదాలకు గురి అవుతున్నారన్నారు.  అవగాహన కల్పించడంతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మండల స్థాయిలో ఒక్కో ఎస్‌ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను  దాతల సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఫ్యాక‌్షన్‌ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.   రాత్రి బసలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ శ్రీధర్‌ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు