మరుగుదొడ్డే పక్కాఇల్లు!

19 Sep, 2017 10:37 IST|Sakshi
మరుగుదొడ్డిని ఇల్లుగా చేసుకున్న లచ్చమ్మ

ఆత్మగౌరవం సిగ్గు పడింది
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (ముత్తుకూరు) : ఉన్న ఇల్లును కూలగొట్టుకొని, నిలువ నీడ లేక మరుగుదొడ్లనే నివాసాలుగా మార్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మండలంలోని పైనాపురం పంచాయతీలో గిరిజనకాలనీలో ఈ దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. గత ఏడాది మండలానికి 1,250 పక్కాగృహాలు మంజూరుకాగా వీటిల్లో ఒక్క ఇల్లు కూడా నేటి వరకు పూర్తికాలేదు. పైనాపురం పంచాయతీకి 63 గృహాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ సంవత్సరం 10 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. వీటిల్లో గిరిజనకాలనీకి 7 ఇళ్లు కేటాయించారు. టీడీపీ నాయకులు మంజూరు విషయం ప్రకటించడంతో తుపాకుల లచ్చమ్మ అనే మహిళ ఉన్న పూరిల్లును కూలగొట్టుకొంది. పనులు మొదలుకాకపోవడంతో కొత్తగా నిర్మించిన మరుగుదొడ్డినే నివాసంగా మలుచుకొంది. ఇంటి సామాన్లను మరుగుదొడ్డిలో సర్దేసింది. వెలుపల తాటాకుల పంచ వేసుకొని, రాత్రి వేళ లచ్చమ్మ దంపతులు దీని కింద నిద్రిస్తున్నారు. ఈ కాలనీలో పట్టలు కప్పిన పూరిపాకల ముందు కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లు వెక్కిరిస్తున్నట్టు నిల్చున్నాయి.

మరిన్ని వార్తలు