లంచం తీసుకుని... పని చేయలేదు

8 Jun, 2016 09:24 IST|Sakshi
లంచం తీసుకుని... పని చేయలేదు

పొలం పాస్‌బుక్ కోసం రూ.10 వేలు లంచం ఇచ్చినా. భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం రూ. 5వేలు ఇచ్చినా..  
 పని కాలేదు.
 నవనిర్మాణ దీక్షల సదస్సులో ఓ మహిళ ఆవేదన

 
ఆళ్లగడ్డ: నవనిర్మాణ దీక్షల సందర్భంగా మంగళవారం ఆళ్లగడ్డలో నిర్వహించిన సదస్సులో విమలారాణి అనే మహిళ అధికారులకు షాక్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో అవినీతికి తావులేదని..ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా ఎటువంటి పనినైనా అధికారులు చేసి పెడుతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఇప్పటికి ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తనకు పాస్‌బుక్ రాలేదన్నారు.
 
దీనికోసం రూ. 10 వేలు లంచం ఇచ్చానన్నారు. తన భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం రూ. 5వేలు ఇచ్చినా పనికాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పనీ సక్రమంగా కానప్పుడు ఇలాంటి సమావేశాలు ఎందుకని అధికారులను ఆమె నిలదీశారు. దీంతో సమావేశానికి వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు కొందరు మహిళా అధికారులు చప్పట్లు కొట్టి ఆమె సంఘీభావం తెలపడంతో అధికారులు తెల్లబోయారు.
 
తహశీల్దార్ స్పందించి.. సమస్యను పరిష్కరిస్తామని చెప్పి.. కొంచం సేపటికి వర్షం వస్తోందని వెంటనే సమావేశాన్ని ముగించారు. అంతకు ముందు ఎవరైనా మాట్లాడవచ్చని అధికారులు చెప్పడంతో సీపీఐ నాయకులు మాట్లాడుతామని లేచారు. ప్రభుత్వ పథకాలపై మంచిగా మాట్లాడాలి తప్ప విమర్శించ కూడదని నిబంధన పెట్టారు.  మంచి పథకాలను అభినందిస్తాం తప్ప.. ఏమీ చేయని పథకాలపై పొగడమంటే ఎలా అంటూ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు