మహిళా దొంగ అరెస్ట్

18 May, 2016 09:31 IST|Sakshi

ప్రొద్దుటూరు: స్థానిక ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో మంగళవారం అనుమల శోభ అనే మహిళా దొంగను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ.1 లక్షా 92 వేలు విలువ చేసే 95 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను సీఐ ఓబులేసు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

గతేడాది డిసెంబర్ 20న ఆటోనగర్ సమీపంలోని ఎఫ్‌జీ  ఫంక్షన్ హాల్‌లో ఓ మహిళ బ్యాగ్‌లో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 90 గ్రాముల బంగారు నగలను చోరీ చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో అదే రోజు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే ఈ నెల 15న అన్వర్ థియేటర్ వద్ద ఓ మహిళ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె బ్యాగులో ఉన్న ఐదు గ్రాముల బంగారు చైన్‌ను అపహరించాడు. ఈ రెండు కేసులకు సంబంధించి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో మంగళవారం ఎర్ర గుంట్ల బైపాస్‌రోడ్డు వద్ద ఉన్న అనుమల శోభ అక్కడికి వచ్చిన పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని బ్యాగును పరిశీలించగా చైను, జుంకీలు, నెక్లెస్, బుట్ట కమ్మలు ఉన్నాయి.

బంగారు ఎక్కడిదని ప్రశ్నించగా ఎఫ్‌జీ ఫంక్షన్‌హాల్‌లోనూ, రెండు రోజుల క్రితం అన్వర్ థియేటర్ వద్ద బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. కడపలోని రామాంజనేయపురానికి చెందిన శోభపై ప్రొద్దుటూరు వన్‌టౌన్, కడప వన్‌టౌన్, బద్వేలులో రెండు కేసులు ఉన్నాయి. ఈమె భర్త, అక్క, బావలు కూడా పాత నేరస్తులని, వారిపై కూడా కేసులున్నట్లు సీఐ తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు చలపతి, మహేష్, ఆంజనేయులు, జిఎండి బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు