నడిరోడ్డుపై ‘నీటి’గోస!

10 Aug, 2016 19:32 IST|Sakshi
ప్రజ్ఞాపూర్‌లో ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
  • దాహార్తి తీర్చాలంటూ ప్రజ్ఞాపూర్‌లో మహిళల ఆందోళన
  • సమన్వయ లోపంతోనే పూర్తి కాని పనులు
  • సీఎం ఆదేశించినా పట్టని అధికారులు
  • గజ్వేల్: పల్లెల గొంతు తడిపే ‘మిషన్‌ భగీరథ’ ప్రారంభమైన కోమటిబండకు కూతవేటు దూరంలోని ప్రజ్ఞాపూర్‌లో గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఇక్కడ కొన్ని రోజులుగా మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా విసిగిపోయిన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా పోలీసులతో మహిళలకు వాగ్వాదం జరిగింది. సమస్యలుంటే నగర పంచాయతీ కార్యాలయంలో చెప్పాలని.. రోడ్డెక్కితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించి ధర్నాను విరమింపజేశారు.

    ఇదీ సమస్య..
    నగర పంచాయతీ పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజుపల్లి, క్యాసారం గ్రామాలకు నిత్యం 5.19 ఎంఎల్‌డి (50.19 లక్షల లీటర్ల నీరు) అవసరం. 4 వేల వరకు నల్లాలు ఉన్నాయి. గతంలో 15 ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా 2 (20 లక్షల లీ.) ఎంఎల్‌డీ లీటర్ల నీటిని సరఫరా చేసేవారు. నాలుగు నెలలుగా పరిస్థితి మారింది.

    ఇక్కడ ‘మిషన్‌ భగీరథ’ శాశ్వత పైప్‌లైన్‌ నిర్మాణం, నల్లా కనెక‌్షన్ల నిర్మాణం చేపట్టకున్నా...(ఇప్పటికీ ఇంకా ఇక్కడ ‘మిషన్‌ భగీరథ’ పనులు చేపట్టలేదు) సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో కోమటిబండలోని ‘మిషన్‌ భగీరథ«’ హెడ్‌ రెగ్యులేటరీ నుంచి నిత్యం ఇక్కడికి గడువుకు ముందే 10-20 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు.

    పాత నల్లాల వ్యవస్థ నీటి సరఫరా ద్వారా గోదావరి జలాలతోపాటు ఇక్కడున్న వనరులతో కలిపి మొత్తం 30-35 లక్షల లీటర్ల నీటి సరఫరా జరుగుతున్నది. మొదటగా గజ్వేల్‌ పట్టణానికి మాత్రమే పాత నల్లాల వ్యవస్థ ద్వారా నీటిని అందించారు. ప్రజ్ఞాపూర్‌లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరిగేది. ఈ నీళ్లు సరిపోక గతేడాది మే నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు జనం ఆందోళనకు దిగారు.

    విస్తరణ పనులతోనే ఆటంకం
    గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రోడ్డు విస్తరణ పనులు కారణంగా పైప్‌లైన్‌ దెబ్బతిని నీరు ఇవ్వలేకపోతున్నామని చెప్పిన అధికారులు...జనం ఆగ్రహావేశాలు చూసి 3 నెలల క్రితం తాత్కాలిక పైప్‌లైన్‌ వేసి వాటితో ట్యాంకులు నింపి గజ్వేల్‌లో మాదిరిగానే ఇక్కడా పాత నల్లాల వ్యవస్థ ద్వారానే నీటిని అందించారు.

    దీంతో సమస్య తీరింది. ఇటీవల ప్రధాని పర్యటన నేపథ్యంలో వడివడిగా పైప్‌లైన్‌ విస్తరణ పనులు చేపట్టిన క్రమంలో తవ్వకాలతో గతంలో తాత్కాలికంగా వేసిన పైప్‌లైన్‌ దెబ్బతిన్నది. ఫలితంగా ప్రజ్ఞాపూర్‌కు నీటి సరఫరా ఆగింది. 10 వేల జనాభా ఉన్న ప్రజ్ఞాపూర్‌లో 1500కిపైగా నల్లా కనెక‌్షన్లు ఉన్నాయి. తక్కువలో తక్కువగా ఇక్కడికి నిత్యం 5 లక్షల నీటిని అందించగలిగితే ఇబ్బంది ఉండదు. కానీ ప్రస్తుతం 30 ట్యాంకర్ల ద్వారా 1.5 లక్షల లీటర్ల నీటినే సరఫరా చేస్తున్నారు.

    పైప్‌లైన్‌ విస్తరణ పనుల్లో జాప్యం
    మరోవైపు శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్‌ విస్తరణ 20 రోజులైనా పూర్తి కావడం లేదు. ప్రత్యేకించి ఇందిరాపార్క్‌ చౌరస్తా నుంచి పిడిచెడ్‌ రోడ్డు వరకు, మరికొన్ని చోట్ల పనులు పూర్తి చేస్తే శాశ్వతంగా వేస్తున్న ఈ లైన్‌ ద్వారా ప్రజ్ఞాపూర్‌లోని ట్యాంకుల్లోకి నీటిని ఎక్కించుకొని...నల్లాల బిగించే వరకు నీటిని అందించవచ్చు. ఇందుకోసం కొన్ని చోట్ల తాత్కాలిక లైన్‌ కూడా వేయాల్సి ఉన్నది. కానీ ఈ పనుల నిర్వహణలో నగర పంచాయతీ, వాటర్‌గ్రిడ్‌ విభాగం మధ్య సమన్వయ లోపం నెలకొంది.

    మరోవైపు ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా పనులు వేగిరం చేయటం లేదన్న ఆరోపణలున్నాయి.  మొత్తానికి ఈ మూడు విభాగాల నిర్వాకం ప్రజ్ఞాపూర్‌ మహిళలకు చుక్కలు చూపిస్తోంది. కాగా, గురువారం ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు నగర పంచాయతీ, మిషన్‌ భగీరథ, ఆర్‌అండ్‌బీ అధికారులతో గురువారం నిర్వహించే సమావేశంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందోమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు