ముగ్గురు మహిళా రైతులు అరెస్ట్

13 Aug, 2015 13:53 IST|Sakshi

నిజామాబాద్ : గిరిజనులు సాగు చేసిన అటవీ భూముల్లో కందకాలు తవ్వేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నందుకు ముగ్గురు గిరిజన మహిళా రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... అటవీ శాఖ అధికారులు మంగళవారం రావుట్ల గ్రామంలో గిరిజనులు సాగు చేసిన అటవీ భూముల్లో పంటను నాశనం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ అటవీ భూముల్లో కందకాలను తవ్వేందుకు అటవీ అధికారులు నాలుగు జేసీబీలతో ఈ రోజు గ్రామానికి చేరకున్నారు. పోలీసులు సహాయంతో వచ్చిన అటవీ అధికారులను గిరిజన మహిళా రైతులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు ముగ్గురు మహిళా రైతులను అరెస్ట్ చేశారు. కాగా, భూములను పరిశీలించేందుకు వచ్చిన అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తదితరులను గ్రామంలోనే అడ్డుకొని పీఎస్‌కు తరలించారు. పోలీసులు సహాయంతో అటవీ శాఖ అధికారులు కందకం తవ్వకాలను కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు