కదంతొక్కిన మహిళలు

12 Mar, 2017 23:05 IST|Sakshi
కదంతొక్కిన మహిళలు
– నగరంలో ఉమెన్స్‌ ఆర్మీ మారథాన్‌ వాక్‌
  
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా నగరంలో మహిళలు ఆదివారం మారథాన్‌ వాక్‌ (సామూహిక కాలినడక) నిర్వహించారు. బుట్టా ఫౌండేషన్, ఉమెన్‌ ఆర్మీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మారథాన్‌ వాక్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ మసాల పద్మజ, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి సతీమణి ఎస్వీ విజయమ్మతో పాటు బుట్టా ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌ స్థానిక కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సాధికారిత దిశగా పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
 
మహిళలు, విద్యార్థినులు ఫ్లెక్సీలు చేతబట్టి  కొండారెడ్డి బురుజు వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మారథాన్‌లో పాల్గొన్న మహిళలతో పాతబస్టాండులోని ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శన నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళలకు అవార్డులు ప్రదానం చేశారు. సుమారు 600 మంది మహిళలు నేత్రదాన ప్రతిజ్ఙ చేశారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ వారు ఉచిత  బ్లడ్‌గ్రూప్‌ శిబిరం నిర్వహించారు. ప్రత్యేక కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన దుబాయ్‌వాసి సబితామీనన్‌ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం మహిళలు రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఉమెన్స్‌ ఆర్మీ సీఈవో కె.సురేఖతో పాటు అరైజ్‌ ఫౌండేషన్‌ సభ్యులు, ఎన్సీసీ విద్యార్థులు, రవీంద్ర, కేవీఆర్‌ కళాశాలల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు