చిట్టీ డబ్బులు కట్టడం లేదంటూ..

11 Aug, 2016 18:57 IST|Sakshi
వివరాలు తెలుపుతున్న రజియా
  • మహిళను అపహరించిన నిర్వాహకులు
  • నిర్బంధించి.. వేధింపులకు గురిచేసిన వైనం
  • పోలీసులు, మీడియా సాయంతో బయటపడిన మహిళ
  • కొత్తగూడెం(ఖమ్మం): చిట్టీ డబ్బుల కోసం ఓ వివాహితను అపహరించి.. మానసిక, శారీరక వేధింపులకు గురిచేయగా.. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు, మీడియా సహకారంతో విముక్తి లభించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఎస్‌కే.అక్బర్‌ అనే ఆటో డ్రైవర్‌.. భార్య రజియా, పిల్లలతో కలిసి 2013లో కొత్తగూడెం మండలం రామాంజనేయ కాలనీలో నివాసం ఉండేవాడు. కాగా.. ఆ సమయంలో ఆటో కొనుగోలు కోసం అక్బర్‌.. హుస్సేన్‌బీ వద్ద రూ.లక్ష విలువచేసే చిట్టీ వేశాడు.

    అవసరాల నిమిత్తం పాటపాడి ఎత్తుకున్నాడు. అనంతరం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అక్బర్‌ కుటుంబంతో సహా ఖమ్మం వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే చిట్టీ డబ్బులు ప్రతి నెలా చెల్లిస్తామని చెప్పినా వినిపించుకోకుండా వారిపై చిట్టీ నిర్వాహకురాలు హుస్సేన్‌బీ, పెద్ద హుస్సేన్‌బీ, చిన్న హుస్సేన్‌బీ, యాకూబీ, ఎస్‌డీ.నుజ్జు తదితరులు ఖమ్మం వెళ్లి చిట్టీ డబ్బుల నిమిత్తం తరచూ అక్బర్, భార్య రజియాతో ఘర్షణ పడుతుండేవారు. ఈనెల 6న అక్బర్‌ ఆటో నడిపేందుకు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య కనిపించలేదు.

    ఆరా తీయగా.. హుస్సేన్‌బీతోపాటు పలువురు ఖమ్మం వచ్చి రజియాను అపహరించి కొత్తగూడెం తీసుకొచ్చారని.. గృహ నిర్బంధం చేశారని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి హుస్సేన్‌బీతోపాటు మిగతా వారంతా కలిసి రజియాను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ భర్త స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు తెలుసుకుని హుస్సేన్‌బీ ఇంటికి వెళ్లగా.. రజియాను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల సాయంతో రజియా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వివరాలు వెల్లడించింది. హుస్సేన్‌బీ, ఆమె కూతుళ్లతోపాటు నరసమ్మ, జగదీష్, మధు తనను వేధించారని పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు