శిక్షణ కేంద్రం సమస్యలమయం

24 Feb, 2017 23:17 IST|Sakshi
శిక్షణ కేంద్రం సమస్యలమయం
శిథిలావస్థకు చేరిన భవనాలు 
మరమ్మతులకు ప్రతిపాదనలతోనే సరి 
పట్టించుకునే వారేరీ?
రాజమహేంద్రవరం రూరల్‌ : మహిళా సాధికారత కోసం తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతల ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మహిళలకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాటికి మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసేవారే కరువయ్యారు. ఉన్నతాధికారులకు, స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. దీనిని బట్టి మహిళలపై ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందోనని అర్థమవుతోంది. 
మహిళల ఆర్థికాభివృద్ధికి...
మహిళలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి, స్వావలంబనకు కృషి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో 1990లో బొమ్మూరు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళాప్రాంగణం)ను ప్రారంభించారు. అప్పటి నుంచి వివిధ కోర్సుల్లో సుమారు 75 వేల మందికి శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారు. పదెకరాల స్థలంలో నిర్మాణం చేపట్టిన భవనాలతో పాటు తలుపులు, కిటికీలు శిథిలావస్థకు చేరాయి. ప్రాంగణంలో రోడ్లు సైతం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఈ ప్రాంగణంలో మహిళలకు అనేక రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఏ సమయంలో పెచ్చులు ఊడి మీద పడతాయోనని మహిళలు ఆందోళన చెందుతున్నారు. 
గోడు పట్టని పాలకులు
శిక్షణల పర్యవేక్షణకు వస్తున్న అధికారులందరికీ భవనాలు మరమ్మతుల విషయాన్ని ప్రాంగణం మేనేజర్‌ స్వయంగా వివరిస్తున్నా ఉన్నతాధికారుల్లో మాత్రం చలనం ఉండడం లేదు. గత ఏడాది గిరిజన శిక్షణ కేంద్రం శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి స్వయంగా తీసుకువెళ్లినా ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. జిల్లా ఉన్నతాధికారులు, మహిళా ఆర్థిక సంస్థ డైరెక్టర్లు పరిశీలించి వెళ్లినా ఇప్పటివరకు ప్రయోజనం చేకూరలేదు. భవన మరమ్మతులకు రూ.16.60 లక్షలు ప్రతిపాదనలు పంపించినా మంజూరు కాలేదని ప్రాంగణం మేనేజర్‌ రమణశ్రీ తెలిపారు. మహిళాసాధికార సంస్థ చైర్మన్, డైరెక్టర్లు, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని పేర్కొన్నారు.
 
మరిన్ని వార్తలు