లొంగిపోయిన దళ సభ్యురాలు

10 Aug, 2016 22:48 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ భాస్కరన్‌
భద్రాచలం : మావోయిస్టు వెంకటాపురం ఏరియా కమిటీ దళ సభ్యురాలు మడకం లక్ష్మి అలియాస్‌ వెన్నెల భద్రాచలం ఏఎస్పీ ఎదుట బుధవారం లొంగిపోయింది. ఈ మేరకు వివరాలను ఏఎస్పీ భాస్కరన్‌ తన కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. చర్ల మండలం రాళ్లకట్ట గ్రామానికి చెందిన మడకం లక్ష్మి 2102లో మిలీషియా కమాండర్‌ జయరాం ద్వారా మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిపారు. నెలపాటు మిలీషియా సభ్యురాలిగా పనిచేసిన లక్ష్మి తరువాత వెంకటాపురం ఏరియా కమిటీలో దళ సభ్యురాలిగా చేరిందన్నారు. వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి సునీతకు గార్డుగా పని చేసిందన్నారు. 2015 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఖమ్మం ఎస్‌జీఎస్‌లో పని చేస్తోందన్నారు. దళంలో పనిచేసిన కాలంలో బొట్టెంతోగు, మినప, కంచాల ఎన్‌కౌంటర్‌లు, చర్ల మండలం సత్యనారాయణపురం బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ పేల్చివేత వంటి ఘటనల్లో పాల్గొందన్నారు. కుర్సం చేతు, మచ్చకి దారయ్య, భగత్, నీలం నరేష్‌ హత్య కేసు, వద్దిపేట, పూసుగుప్పు రోడ్డు తవ్విన కేసు, వద్దిపేట జేసీబీ తగులబెట్టిన కేసులతో సహా మొత్తం 12 కేసులు ఆమెపై నమోదైనట్లు వివరించారు. అనారోగ్య కారణాలతో లక్ష్మి లొంగిపోతున్నట్లు తమకు తెలిపిందన్నారు. ఆమెకు ప్రభుత్వ పరంగా రూ.5వేలను తక్షణ సహాయం కింద అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆమెపై గతంలో రూ.లక్ష రివార్డు ఉందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో వెంకటాపురం సీఐ సాయిరమణ, చర్ల ఎస్సై రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు