హత్యా.. ఆత్మహత్యా ?

13 Oct, 2016 22:05 IST|Sakshi
హత్యా.. ఆత్మహత్యా ?
విజయవాడ (చిట్టినగర్‌) : భర్త నుంచి విడిపోయి మరో యువకుడితో సహజీవనం సాగిస్తున్న వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్యకు గురైందా.. అనే అంశంపై జోరుగా చర్చసాగుతోంది. పోలీసుల కథనం ప్రకారం... విజయవాడ కొత్తపేట రావిచెట్టు సెంటర్‌ కొండ ప్రాంతానికి చెందిన బొట్టు వెంకటరమణ(25)కు తొమ్మిదేళ్ల క్రితం వీరాస్వామి అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా వెంకటరమణ కొంతకాలంగా వేరుగా ఉంటోంది. బీసెంటర్‌ రోడ్డులోని ఓ షాపింగ్‌ మాల్‌లో పని చేస్తున్న ఆమెకు ఏడాదిన్నర క్రితం సురేష్‌ అనే ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వీరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వెంకటరమణ, సురేష్‌ కలిసి నాలుగు నెలలుగా ఇదే ప్రాంతంలోని తమ్మిన కొండయ్య వీధిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సురేష్, వెంకటరమణ మధ్య గొడవ జరిగింది. గురువారం ఉదయం వెంకటరమణ పిన్ని సుశీల నిద్ర లేచే సరికి ఇంటి ముందు ముగ్గు వేసి లేదు. దీంతో ఆమె వచ్చి ఇంట్లోకి చూడగా... వెంకటరమణ మృతదేహం నేలపై పడి ఉంది. వెంటనే ఆమె అక్క ఫణికంటి పద్మావతి, బావ సుబ్బారావుకు సమాచారం ఇచ్చారు. కొత్తపేట పోలీసులు ఘటనాస్థలంలో వివరాలు సేకరించి మృతదేహానికి పంచానామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సురేష్‌ కనిపించకుండా పోయాడు. వెంకట రమణ ఇంట్లో ఉరి వేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపించడం లేదు. మరోవైపు సురేష్‌ కనిపించకపోవడంతో పోలీసులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. రమణ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 
 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా