కి'లేడీ' క్షణాల్లో దోచేస్తుంది

7 Mar, 2017 23:05 IST|Sakshi
కి'లేడీ' క్షణాల్లో దోచేస్తుంది

పోలీసులకు చిక్కిన కిలేడీ
మూడేళ్లలో 24 దొంగతనాలు
63 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు అపహరణ  
33 తులాల ఆభరణాలు, రూ.27వేలు, కారు, బైక్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన క్రైం డీసీపీ రవికుమార్‌ మూర్తి


పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): షాపింగ్‌ మాల్స్, దేవాలయాలు, బస్సులు, ఆటోలు... ఎక్కడైనా జనసంచారం ఉంటే చాలు. క్షణాల్లో మహిళల మెడలోని ఆభరణాలు, వారి హ్యాండ్‌ బ్యాగుల్లోని విలువైన వస్తువులు దొంగలించేస్తోంది ఓ కిలేడీ. మూడేళ్లలో 24 దొంగతనాలకు పాల్పడి 63 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు అపహరించుకుపోయిందంటే ఎంతటి గజదొంగో అర్థం చేసుకోవచ్చు. దొంగలించిన సొత్తుతో కొంత స్థలం, కారు, ద్విచక్ర వాహనం కొనుగోలు చేసుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్న శ్రావణజ్యోతిని, ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని నగర క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రవికుమార్‌ మూర్తి వివరాలు వెల్లడించారు.

పదేళ్ల నుంచి దొంగతనాల బాట
గోపాలపట్నం లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన కాండ్రేగుల శ్రావణ జ్యోతి (25) దొంగతనాలు చేయడంలో ఆరితేరిపోయింది. 2002లో తండ్రి కుటుంబ సభ్యులను విడిచి వెళ్లిపోవడంతో తల్లితో కలిసి జీవించేది. ఈ క్రమంలో 2007 నుంచి దొంగతనాల బాటపట్టింది. పదో తరగతి వరకు చదువుకున్న జ్యోతి జన సంచారం అధికంగా ఉన్న షాపింగ్‌ మాల్స్, దేవాలయాలు, బస్సులు, ఆటోలలో ప్రయాణిస్తూ మహిళల మెడలో ఉన్న గొలుసులు, వారి హ్యాండ్‌ బ్యాగ్‌లలోని విలువైన వస్తువులు దొంగిలించడంలో సిద్ధహస్తురాలిగా తయారయింది. ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పిరాది హరికుమార్‌ను 2010లో పెళ్లి చేసుకుంది. జ్యోతి నిజస్వరూపం తెలిసినప్పటికీ విలాసవంతమైన జీవితం గడిపేందుకు హరికుమార్‌ ఆమెను వివాహం చేసుకన్నాడని,  అనంతరం కలిసే దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో వెల్లడైంది. కొన్నాళ్ల తర్వాత కుమారుడు పుట్టడంతో వీరిద్దరూ విడిపోయారు. దీంతో భర్త హరికుమార్‌పై 2015లో మహిళా పోలీస్‌ స్టేషన్‌లో శ్రావణ జ్యోతి ఫిర్యాదు చేసింది.

8 స్టేషన్లలో 24 కేసులు
2014–16 సంవత్సరాల మధ్య జ్యోతి 24 దొంగతనాలకు పాల్పడింది. ఆమెపై ఇప్పటి వరకు గోపాలపట్నం పీఎస్‌లో 7, ఎయిర్‌పోర్ట్‌ పీఎస్‌లో 6, రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో 4, పెందుర్తి పీఎస్‌లో 3, ఎంఆర్‌పేట, ద్వారకానగర్, కంచరపాలెం, ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లలో ఒక్కో కేసు నమోదయ్యయి. ఆయా ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన శ్రావణజ్యోతి సుమారు 63 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు దొంగిలించింది. తాను దొంగలించిన బంగారాన్ని గోపాలపట్నం గణేష్‌నగర్‌కు చెందిన కొత్తల బుల్లేశ్వరరావు ద్వారా విక్రయించేంది. బంగారు ఆభరణాల తయారీ పనిచేసే బుల్లేశ్వరరావు దొంగ సొత్తును సులువుగా మారకం చేసేవాడు. ఈ క్రమంలో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడడంతో దొంగ సొత్తునంతటినీ బుల్లేశ్వరరావు వద్దే ఉంచేది. ఆయనతోపాటు జ్యోతికి సహకరించిన కురుపాం మార్కెట్‌ పప్పుల వీధికి చెందిన అబ్దుల్‌ లతీఫ్‌ ఖాన్‌ (34), టౌన్‌హాలు ప్రాంతానికి చెందిన గౌరిప్పాడు రవికుమార్‌ (40)లను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ప్రస్తుతం జ్యోతి నుంచి 33 తులాల బంగారు ఆభరణాలు, రూ.27వేల నగదు, దొంగలించిన సొత్తుతో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం, కారు, ఓ స్థలానికి చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రవికుమార్‌ మూర్తి వెల్లడించారు. అరెస్ట్‌ చేసిన నిందితుల నుంచి మరింత చోరీ సొత్తు రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏడీసీపీ(క్రైం) వరదరాజులు, క్రైం ఏసీపీలు ఫల్గుణరావు, గోవిందరావు, సీఐలు సూర్యనారాయణ, పైడపు నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు