స్త్రీ నిధి రుణాల లక్ష్యం రూ.30 కోట్లు

18 May, 2017 23:13 IST|Sakshi
స్త్రీ నిధి రుణాల లక్ష్యం రూ.30 కోట్లు
మెప్మా పీడీ రత్నబాబు
గొల్లప్రోలు : ఈ ఏడాది రూ.30 కోట్లు స్త్రీ నిధి రుణాలు మంజూరు చేయడం లక్ష్యంగా నిర్ణయించామని మెప్మా పీడీ కేవీకే రత్నబాబు తెలిపారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నుంచి పట్టణంలోని 11 గ్రూపులు ఇంటింటా సర్వే చేపట్టి గ్యాస్‌కనెక‌్షన్‌ లేనివారిని గుర్తించాలన్నారు. జూన్‌ 2నాటికి అందరికీ గ్యాస్‌ కనెక‌్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పట్టణంలో 1,370 కుటుంబాలకు గ్యాస్‌ కనెక‌్షన్లు లేనట్టు గుర్తించామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది రూ.15 కోట్లు స్త్రీనిధి రుణాలు ఇచ్చామని, ఈ సంవత్సరం రూ.30 కోట్లు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష7వేలు ఉండగా డ్వాక్రామహిళల ఆదాయం రూ.40వేలు మాత్రమేనన్నారు. సరాసరి ఒక్కో మహిళ నెలకు రూ.10వేలు సంపాదించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు గతేడాది రూ.150 కోట్లు ఇవ్వగా ఈ ఏడాది రూ.180 కోట్లు ఇస్తామన్నారు. గొల్లప్రోలులో మెప్మానిధులు పక్కదోవ పట్టిన విషయంపై ఏజీఎం, మెప్మా కార్యాలయ సిబ్బందిని విచారిస్తామన్నారు. ఇప్పటికే తొమ్మిది గ్రూపులకు సంబంధించి నిధులు పక్కదోవ పట్టినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేస్తామన్నారు. కమిషనర్‌ టి.రాజగోపాలరావు, డీపీఎం ఐబీ కెనడీ, డీసీ రాజేంద్రకుమార్, టీఎంసీ శ్రావణ్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు