మద్యంపై మహిళల యుద్ధం

20 Aug, 2017 02:09 IST|Sakshi
మద్యంపై మహిళల యుద్ధం

మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళలు మండిపడ్డారు. దుకాణాన్ని మూసేయాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళలకు తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకొంది. చివరకు పోలీసులను మహిళలు ప్రతిఘటించడంతో మద్యం విక్రయాలను నిలిపివేశారు.

సాలూరు: పట్టణంలోని బంగారమ్మపేట మార్గంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున శనివారం ఆందోళనకు దిగారు. దుకాణం వద్దకు బంగారమ్మపేట, శ్రీనివాసనగర్‌తో పాటు కూర్మరాజుపేట గ్రామానికి చెందిన మహిళలు చేరుకుని మద్యం అమ్మకాలు నిలిపి వేయడమే కాకుండా, షాపును ఇక్కడి నుంచి ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో  సాలూరు, పాచిపెంట, రామభద్రపురం మండలాల ఎస్‌ఐలు మద్యం షాపు వద్దకు చేరుకుని ఆందోళనకారులను కట్టడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. దుకాణంలోకి వెళ్లేందుకు యత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో మద్యం విక్రయాలను నిలిపివేశారు. దీంతో మహిళలు మద్యం దుకాణం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు